ఎవడబ్బ సొమ్మని ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటారు?: నారా లోకేశ్

14-07-2021 Wed 14:54
  • ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించకపోతే స్థలాలను వెనక్కి తీసుకుంటామని బెదిరించడం దారుణం
  • ఇళ్లు కట్టించి ఇస్తామన్న జగన్ హామీ ఎక్కడికి పోయింది?
  • ఈరోజు గోడవర్రు గ్రామంలో పర్యటించాను
How can you take back house plots asks Nara Lokesh

పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల్లో వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించకపోతే స్థలాలను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం బెదిరించడం దారుణమని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ఎవడబ్బ సొమ్మని స్థలాలను వెనక్కి తీసుకుంటారని మండిపడ్డారు. ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.

మంగళగిరి నియోజకవర్గం గోడవర్రు గ్రామంలో ఈరోజు తాను పర్యటించానని లోకేశ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ కక్ష సాధింపులకు పాల్పడిన టీడీపీ కార్యకర్త గోరంట్ల అనిల్ కుటుంబాన్ని పరామర్శించానని చెప్పారు. కరోనాతో పోరాడి, కోలుకున్న గోడవర్రు గ్రామస్తులు, సర్పంచ్ విశ్వనాథపల్లి శివకుమార్ కుటుంబాన్ని పరామర్శించానని అన్నారు. గ్రామంలో టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 మందికి కోవిడ్ చికిత్స అందించామని చెప్పారు. ఈ సందర్భంగా అనేక సమస్యలను తన దృష్టికి ప్రజలు తీసుకొచ్చారని... వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.