బండి సంజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

11-07-2021 Sun 14:07
  • నేడు బండి సంజయ్ జన్మదినం
  • బండి సంజయ్ ను కొనియాడిన పవన్ కల్యాణ్
  • దృఢసంకల్పం ఉన్న నేతగా అభివర్ణన
  • బీజేపీకి మరిన్ని సేవలు అందిస్తాడని విశ్వాసం
Pawan Kalyan wishes Bandi Sanjay on his birthday
తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. బండి సంజయ్ దృఢచిత్తం, పోరాట పటిమ తెలంగాణలో ఆయనను రాజకీయ దృఢసంకల్పం ఉన్న నేతగా నిలిపాయని కొనియాడారు. యువ కార్యకర్తగా రంగప్రవేశం చేసి, అంచెలంచెలుగా ఎదిగిన సంజయ్... తెలంగాణ ప్రజలకు, బీజేపీకి మరిన్ని సేవలు అందిస్తారని విశ్వసిస్తున్నానని పవన్ తెలిపారు. "ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నా తరఫున, జనసేన తరఫున కోరుకుంటున్నాను" అంటూ పవన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా, బండి సంజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్ లో బీజేపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, నగరంలోని ప్రధాన జంక్షన్లు, రహదారులపై అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, తద్వారా ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిపై బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.