Vizag Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీ

  • నగరంలోని సరస్వతీ పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ
  • ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి కొవిడ్ రోగుల ప్రాణాలు నిలిపిన ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తారా?: ఎంఏ గఫూర్
  • దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారు: జి. ఓబులేసు
  • వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న పల్లా శ్రీనివాసరావు
Protest against vizag steel plant privatisation

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కార్మిక, ప్రజా సంఘాలు నిన్న నగరంలోని సరస్వతీ పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ మాట్లాడుతూ.. కరోనా రెండో దశలో టన్నుల కొద్దీ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి పలు రాష్ట్రాలకు అందించి ఎంతోమంది ప్రాణాలు నిలిపిన ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనుకోవడం దారుణమని, వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, ఆయన సహచరులు దేశ సంపదను అదానీ, అంబానీలు, బహుళజాతి కంపెనీ పోస్కోకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు ఆరోపించారు.

వాజ్‌పేయి హయాంలో ప్రైవేటీకరణను అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఎంపీ ఎర్రంనాయుడు అడ్డుకున్నారని, ఢిల్లీలో పోరాడితే మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం ముందుకు వెళ్తోందని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును రక్షించి విజయసాయిరెడ్డి తన నిబద్ధతను నిరూపించుకోవాలని అన్నారు. విశాఖ ఉక్కు కోసం అవసరమైతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News