Sirisha Bandla: సరికొత్త చరిత్రకు సిద్ధమవుతున్న తెలుగమ్మాయి శిరీష.. నేడు రోదసీలోకి!

Sirisha Bandla To Fly On Virgin Galactic Spacecraft Today
  • వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా రోదసీలోకి
  • 90 నిమిషాలపాటు సాగనున్న ప్రయాణం
  • కర్మాన్ రేఖను దాటగానే భార రహిత స్థితి
  • రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసీలోకి..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత రోదసీలోకి వెళ్తున్న నాలుగో భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమనౌక వీఎస్ఎస్ యూనిటీ-22 ద్వారా నేడే రోదసీలోకి వెళ్లనున్నారు. ఈ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు మరో ఐదుగురు వెళ్తుండగా అందులో 34 ఏళ్ల శిరీష కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వ్యోమనౌకలో మానవ తీరుతెన్నులకు సంబంధించి ఫ్లోరిడా యూనివర్సిటీ రూపొందించిన ప్రయోగాన్ని శిరీష నిర్వహిస్తారు. శిరీష ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

న్యూ మెక్సికోలో వర్జిన్ గెలాక్టిక్ నిర్మించిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి నేడు మొదలయ్యే అంతరిక్ష యాత్ర 90 నిమిషాలపాటు కొనసాగుతుంది. భూమి నుంచి 90 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న వ్యోమనౌక భూమికి, రోదసీకి సరిహద్దుగా భావించే కర్మాన్ రేఖను దాటి వెళ్తుంది. ఇక్కడికి చేరిన వారిని వ్యోమగాములుగానే పరిగణిస్తారు. వ్యోమనౌక అక్కిడికి చేరాక అందులోని వారందరూ కొద్దిసేపు భార రహిత స్థితిని అనుభవిస్తారు. అనంతరం వ్యోమనౌక తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది.
Sirisha Bandla
Virgin Galactic
Space
Guntur

More Telugu News