Bengaluru: పొరుగింట్లో ఆడుకుందని.. బిడ్డను చావబాది వాతలు పెట్టిన తల్లి

Woman Beats Her Daughter for playing in Neighbour House
  • బెంగళూరులో గత నెలలో దారుణ ఘటన
  • దెబ్బ తగిలి ఆసుపత్రికి తీసుకెళ్తే తాజాగా బయటపడిన వైనం
  • తల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. బెయిల్ పై విడుదల
పొరుగింట్లో ఆడుకున్నందుకు సొంత బిడ్డను విచక్షణా రహితంగా కొట్టిందో తల్లి (35). అక్కడితో ఆగకుండా చేతిపై కొవ్వొత్తితో కాల్చి వాతలు పెట్టింది. గత నెల మూడో వారంలో జరిగిన ఈ దారుణ ఘటన.. తాజాగా వెలుగులోకి వచ్చింది.

గత సోమవారం తొమ్మిదేళ్ల తన పాపను ఓ తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లి, ఆడుకుంటూ కూతురు కిందపడిపోయిందని వైద్యులతో చెప్పింది. చేతిపై కాలిన గాయాలుండడంతో.. అనుమానించిన వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఓ మహిళా పోలీసు అధికారి వచ్చి బాధిత చిన్నారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

పొరుగింట్లో ఆడుకుంటూ ఉండగా.. తన తల్లి కోపంతో వచ్చి ఇంటికి తీసుకెళ్లిందని, ఓ మొద్దు కర్రతో చితకబాదిందని చిన్నారి చెప్పింది. ఆ తర్వాత కుడి చెయ్యిపై కొవ్వొత్తితో కాల్చి వాతలు పెట్టిందని తెలిపింది. అయితే, తాను వాతలు పెట్టలేదని ఆమె తల్లి చెప్పింది. చిన్నారి చెప్పిన దాని ప్రకారం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.. ఆ తర్వాత బెయిలుపై విడుదల చేశారు.

భర్త నుంచి సదరు మహిళ విడిపోయిందని, చిన్న కూతురుతో కలిసి ఆర్టీ నగర్ లో జీవిస్తోందని పోలీసులు చెప్పారు. పెద్ద కూతురుతో ఆమె భర్త వేరే చోట ఉంటున్నారన్నారు. తమను పొరిగింటి వారు చీటికిమాటికీ సూటిపోటి మాటలతో వేధిస్తుంటారని, అలాంటి వారి ఇంటికి తన కూతురు వెళ్లడంతోనే కోపమొచ్చి కొట్టానని ఆమె చెప్పిందంటూ పోలీసులు తెలిపారు.
Bengaluru
Karnataka
Crime News

More Telugu News