Uttar Pradesh: యూపీలో ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువుంటే ప్రభుత్వ ఫలాలు కట్​: జనాభా నియంత్రణ బిల్లు ముసాయిదా విడుదల

  • ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం
  • కుటుంబంలో నలుగురికే రేషన్ కార్డు
  • ఇద్దరు పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగులకు రెండు అదనపు ఇంక్రిమెంట్లు
  • ఒక్కరే ఉంటే నాలుగు ఇంక్రిమెంట్లు అదనం
  • సామాన్యులకూ ప్రోత్సాహకాలు
UP Government Releases Population Control Bill Draft

జనాభా నియంత్రణ ముసాయిదా బిల్లును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఇద్దరికి మించి సంతానం ఉండకూడదన్న నిబంధనను అందులో పొందుపరిచింది. కేవలం ఇద్దరు సంతానం ఉన్న వారికే ప్రభుత్వ ఫలాలు అందుతాయని పేర్కొంది. ఈ నిబంధనను అతిక్రమించిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించనుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలూ ఉండవని తేల్చి చెప్పింది. ఇంట్లో కేవలం నలుగురికే రేషన్ కార్డును పరిమితం చేస్తూ నిబంధనను పొందుపరిచింది.

ఇద్దరు పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సహకాలను ఇవ్వనుంది. మొత్తం సర్వీస్ లో రెండు అదనపు ఇంక్రిమెంట్లను ఇచ్చేలా ముసాయిదాలో పేర్కొంది. ఇల్లు లేదా స్థలం కొనుగోలులో సబ్సిడీ ఇవ్వనుంది. వాటితో పాటు కరెంట్, నీటి బిల్లుల్లో రాయితీలు, భవిష్యనిధిలో 3 శాతం ఇంక్రిమెంట్ వంటి వాటిని అందించనుంది. ఒక్కరే సంతానం ఉంటే నాలుగు అదనపు ఇంక్రిమెంట్లతో పాటు ఆ సంతానానికి 20 ఏళ్లు వచ్చేదాకా ఉచిత విద్య, వైద్యాన్ని అందిస్తామని ఆ ముసాయిదాలో పేర్కొంది.

సామాన్య జనానికీ ప్రోత్సాహకాలను అందిస్తామని వెల్లడించింది. కరెంట్, నీటి బిల్లులు, ఇంటి పన్ను, గృహ రుణాల్లో రాయితీలు ఇస్తామని పేర్కొంది. ఈ బిల్లు ముసాయిదాను యూపీ న్యాయ కమిషన్ వెబ్ సైట్ లో పెట్టారు. అందులో మార్పులు చేర్పులకు సంబంధించి సలహాలు సూచనలకు జులై 19 వరకు గడువునిచ్చింది. ఒకరి కన్నా ఎక్కువ భార్యలు లేదా భర్తలున్న వారికీ ఈ మినహాయింపులుండవని ముసాయిదాలో పేర్కొంది. 2021–2030కి సంబంధించి జనాభా నియంత్రణ చట్టాన్ని రేపు యోగి ప్రభుత్వం ప్రకటించనుంది.

More Telugu News