Viral Videos: వరద నీటిలో.. పడవులలో పెళ్లి ఊరేగింపు.. వీడియో వైరల్!

- బీహార్‌లోని గోబర్సిత్తా గ్రామంలో ఘటన
- నది ఉప్పొంగడంతో వరదలు
- మూడు పడవల్లో పెళ్లి ఊరేగింపు
భారీ వర్షాలు పడ్డాయి.. అయినప్పటికీ పెళ్లి ముహూర్తాన్ని వాయిదా వేసుకోలేదు. వర్షాలకు ఊరంతా వరదలు వచ్చాయి.. అయినా వారి పెళ్లి వేడుకలో జరగాల్సినవన్నీ జరిపించారు. చివరకు వరద నీటిలోనే మూడు పడవలు ఏర్పాటు చేసి పెళ్లి ఊరేగింపును కూడా నిర్వహించారు. ఈ ఘటన బీహార్‌లోని సమస్తిపూర్‌లోని గోబర్సిత్తా గ్రామంలో చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వరుణుడు అడ్డుపడాలని చూసినప్పటికీ పెళ్లి కూతురి ఇంటికి మగపెళ్లివారు ఊరేగింపుగా పడవల్లో వచ్చి తమ సంప్రదాయాన్ని నిలబెట్టుకున్నారు. అక్కడి నుంచి మళ్లీ అవే పడవల్లో పెళ్లి కొడుకు ఇంటికి వివాహ ఊరేగింపును కొనసాగించారు. భారీ వర్షాలకు బాగమతీ నది ఉప్పొంగడంతో ఆ గ్రామం నిండా మోకాళ్లలోతుకుపైగా నీళ్లు నిలిచాయి.