Taliban: ఆఫ్ఘనిస్థాన్ లో 85 శాతం భూభాగాన్ని ఆక్రమించినట్టు ప్రకటించుకున్న తాలిబాన్లు

  • ఆఫ్ఘన్ నుంచి వైదొలగిన అమెరికా సేనలు
  • చెలరేగిపోతున్న తాలిబాన్లు
  • ఇస్లాం ఖలా పట్టణం తమ వశమైందని ప్రకటన 
  • ఖండించిన ఆఫ్ఘన్ ప్రభుత్వం
Taliban says they grabbed majority of Afghan land

దశాబ్దాల తరబడి ఆరని కుంపటిలా ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో మరోమారు అస్థిరత రాజుకుంది. ఇటీవలే అమెరికా సహా నాటో దళాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి పూర్తిగా వైదొలగిన నేపథ్యంలో, తాలిబాన్లు మళ్లీ పేట్రేగిపోతున్నారు. ఆఫ్ఘనిస్థాన్ లో 85 శాతం భూభాగం ఇప్పుడు తమ అధీనంలోనే ఉందని తాలిబాన్లు తాజాగా ఓ ప్రకటన చేశారు. ఇరాన్ తో కీలక సరిహద్దు ప్రాంతంపైనా పట్టు సాధించామని వెల్లడించారు. తమ యోధులు సరిహద్దు పట్టణం ఇస్లాం ఖలాను చేజిక్కించుకున్నారని తాలిబాన్ అధినాయకత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే, ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇస్లాం ఖలా పట్టణంపై తాలిబాన్ ప్రకటనను ఖండించాయి. ఈ పట్టణం వద్ద ఇంకా పోరాటం జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. ఆఫ్ఘన్ రక్షణ బలగాలు, సరిహద్దు భద్రతా దళాలు ప్రస్తుతం ఈ పట్టణం వద్దే మోహరించి, తాలిబాన్లను తరిమికొట్టేందుకు పోరాడుతున్నాయని ఆఫ్ఘనిస్థాన్ హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి తారిఖ్ అరియన్ వెల్లడించారు.

అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 20 ఏళ్ల కిందట ఆఫ్ఘనిస్థాన్ లో ప్రారంభమైన తమ సైనిక కార్యాచరణ ఆగస్టు 31తో పూర్తిగా ముగిసిపోతుందని స్పష్టం చేశారు. తాము ఆశించిన లక్ష్యాలను చేరుకున్నట్టు భావిస్తున్నామని తెలిపారు. మరో తరం అమెరికా సైనికులను ఆఫ్ఘనిస్థాన్ యుద్ధరంగానికి పంపించే ఆలోచన తమకు లేదని ఉద్ఘాటించారు.

More Telugu News