Telangana: ఈ నెల 13న తెలంగాణ క్యాబినెట్ సమావేశం

  • మధ్యాహ్నం 2 గంటలకు భేటీ
  • ప్రగతి భవన్ వేదికగా చర్చ
  • జలవివాదాలు, కరోనా అంశాలు అజెండాగా సమావేశం!
  • పల్లె, పట్టణ ప్రగతిపైనా చర్చించే అవకాశం
  • వ్యవసాయ అంశాలకూ అజెండాలో చోటు!
Telangana cabinet will meet July thirteen

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 13న తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ వేదికగా క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న ఏపీతో జలవివాదాలు, కరోనా పరిస్థితులు, ఆంక్షల సడలింపులు, థర్డ్ వేవ్ అంచనాలు వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఏపీతో అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

సినిమా థియేటర్ల పునఃప్రారంభం, ఇతర సామాజిక కార్యకలాపాలకు అనుమతి ఇచ్చే విషయాన్ని కూడా చర్చించనున్నారు. కరోనా థర్డ్ వేవ్, కొత్త వేరియంట్ల వ్యాప్తి తదితర అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

అంతేగాకుండా, వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో, వ్యవసాయ సంబంధం అంశాలపైనా చర్చ జరగనుంది. విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందించడం, కల్తీ రహిత ఎరువులు, విత్తనాలు రైతులకు అందేలా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు కర్తవ్య బోధ చేయనున్నారు. వీటితో పాటే పల్లె ప్రగతి, పట్టణాభివృద్ధి అంశాలకు కూడా క్యాబినెట్ భేటీ అజెండాలో చోటు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News