AP High Court: కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఏపీ అధికారులకు హైకోర్టు శిక్ష అమలు

  • కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలం
  • కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసిన 36 మంది అభ్యర్థులు
  • తొలుత 9 రోజుల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా
  • తర్వాత సవరించిన న్యాయస్థానం
  • కోర్టు పనివేళలు ముగిసే వరకు న్యాయస్థానంలోనే అధికారులు
High court impose jail term two AP officers in contempt of court case

కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి, ప్రస్తుత పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, అప్పటి ఉద్యానవనశాఖ కమిషనర్ చిరంజీవి చౌదరికి ఏపీ హైకోర్టు శిక్ష విధించింది. కోర్టు ఆదేశించినా పోస్టుల భర్తీలో తమకు అవకాశం కల్పించ లేదంటూ 36 మంది అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు.

నిన్న దీనిపై విచారణ జరగ్గా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్టు తేలడంతో అధికారులు ఇద్దరికీ తొమ్మిది రోజుల సాధారణ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలిచ్చారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మూడు రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేశారు.

స్పందించిన అధికారులు న్యాయస్థానం ఉత్తర్వుల విషయంలో ఇకపై జాగ్రత్తగా ఉంటామని, తమను క్షమించాలని కోర్టును వేడుకున్నారు. వయసు, ఇప్పటి వరకు తాము అందించిన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు. దీంతో స్పందించిన కోర్టు తీర్పును సవరించింది. వెయ్యి రూపాయల జరిమానాతోపాటు కోర్టు పని గంటలు ముగిసే వరకు న్యాయస్థానంలోనే ఉండాలని ఆదేశించింది. దీంతో అధికారులు ఇద్దరూ కోర్టు పనివేళలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు.

More Telugu News