అనకాపల్లి వద్ద కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన... ఇద్దరి మృతి

06-07-2021 Tue 19:01
  • ఒక్కసారిగా కూలిన వంతెన
  • కింద ఉన్న వాహనాలు ధ్వంసం
  • భయంతో పరుగులు తీసిన ప్రజలు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
Under construction bridge collapsed at Anakapalle
అనకాపల్లి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. కింద ఉన్న వాహనాలపై పడడంతో ఇద్దరు మృతి చెందారు. వంతెన కూలడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వంతెన పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలడంతో జనాలు తీవ్ర భయాందోళనలతో పరుగులు తీశారు.

దీనిపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి, ఘటన స్థలం వద్ద సహాయక చర్యలు ప్రారంభించారు. వంతెన కింద మరికొందరు చిక్కుకున్నారేమోనని స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఘటన స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

హైవే విస్తరణలో భాగంగా ఇక్కడ భారీ వంతెన నిర్మాణం జరుగుతోంది. రెండేళ్ల నుంచి ఇక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.