పవన్ సినిమా సెట్లోకి అడుగుపెడుతున్న నిత్యామీనన్!

06-07-2021 Tue 18:09
  • సెట్స్ పైకి మలయాళ రీమేక్
  • పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్
  • 12వ తేదీన షూటింగుకు హాజరు
  • రానా సరసన ఐశ్వర్య రాజేశ్
Ayyappanum Koshiyum remake movie update

నిత్యామీనన్ కి తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. భాష ఏదైనా పాత్ర తనకి నచ్చితేనే చేస్తుంది .. లేదంటే లేదు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే ఆమె అంగీకరిస్తుంది. ఇక పాత్ర ఏదైనా అందులో ఎంతో ఇష్టంగా ఇమిడిపోవడం ఆమె ప్రత్యేకత. సహజత్వానికి దగ్గరగా పాత్రను తీసుకెళ్లడం ఆమెకి బాగా తెలిసిన విద్య. అందువలన ఆమె నటనను ఇష్టపడే అభిమానులు చాలామందినే ఉన్నారు. అలాంటి నిత్యామీనన్ కి ఈ మధ్య కాలంలో అవకాశాలు తగ్గిపోయాయి.

'జనతా గ్యారేజ్' తరువాత తెలుగులో పూర్తిస్థాయి పాత్రను ఆమె చేయలేకపోయింది. అతిథి పాత్రల్లో అడపాదడపా మెరిసిన నిత్యామీనన్, ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తోంది. పవన్ కథానాయకుడిగా 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ రూపొందుతోంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఇప్పటికే ఈ సినిమా 40 శాతం చిత్రీకరణను జరుపుకుంది. కరోనా కారణంగా ఆ మధ్య ఆగిపోయిన షూటింగును తిరిగి మొదలుపెట్టారు. ఈ నెల 12వ తేదీ నుంచి షూటింగులో తొలిసారిగా నిత్యామీనన్ జాయిన్ కానుంది. పవన్ భార్య పాత్రలో నిత్యా మీనన్ నటిస్తుండగా, రానా జోడిగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది.