Santhosh Kumar: లక్ష మొక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కుమార్

Santhosh Kumar started plantaion in Keesara forest
  • కేటీఆర్ జన్మదినం సందర్భంగా కీసర ఫారెస్టును దత్తత తీసుకున్న సంతోష్ 
  • అడవి చుట్టూ ఫెన్సింగ్ వేశామన్న సంతోష్ 
  • మంత్రి మల్లారెడ్డితో కలిసి తొలి మొక్క నాటిన వైనం
పర్యావరణ పరిరక్షణకు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అందరికీ తెలిసిందే. ఆయన ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది. ఎంతో మంది రాజకీయ నేతలు, సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఛాలెంజ్ లను స్వీకరిస్తూ మొక్కలను నాటారు.

తాజాగా ఆయన మరో కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా 2019 జులై 24న కీసర రిజర్వు ఫారెస్టును ఆయన దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా కీసర రిజర్వు ఫారెస్టులోని నూర్ మహమ్మద్ కుంటలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు ఆయన శ్రీకారం చుట్టారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, తొలి మొక్కను నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కీసరగుట్ట అడవి చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగిందని చెప్పారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని అన్నారు. అడవి పునరుద్ధరణలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి, పర్యాటక శాఖ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Santhosh Kumar
TRS
Keesara Forest
One Lakh Plants

More Telugu News