GST Collections: జూన్ నెల జీఎస్టీ ఆదాయం రూ.92,849 కోట్లు

Union finance ministry released GST collections details
  • గత 9 నెలలతో పోల్చితే తక్కువ జీఎస్టీ
  • లక్షకు దిగువన జాతీయ పన్ను వసూళ్లు
  • కరోనా సెకండ్ వేవ్ కారణమంటున్న నిపుణులు
  • ఈ ఏడాది ఏప్రిల్ లో రికార్డు స్థాయి రాబడి
జూన్ మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం వెల్లడించింది. జూన్ నెలలో జీఎస్టీ ఆదాయం రూ.92,849 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో కేంద్ర జీఎస్టీ వసూళ్లు రూ.16,424 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు రూ.20,397 కోట్లు. ఇక సమీకృత జీఎస్టీ వసూళ్లు రూ.49,079 కోట్లు కాగా, సెస్ రూపేణా రూ.6,949 కోట్లు వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది.

2020 జూన్ తో పోల్చితే ఈ జూన్ లో 2 శాతం ఆదాయం పెరిగినట్టు తెలిపింది. అయితే ఇటీవలి సరళితో పోల్చితే జూన్ నెలలో జీఎస్టీ రాబడి తగ్గిందని వివరించింది. 9 నెలల తర్వాత తొలిసారి లక్ష కోట్లకు దిగువన జీఎస్టీ రాబడి నమోదైందని పేర్కొంది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఉత్పన్నమైన సంక్షోభం ఆర్థిక, వాణిజ్య వ్యవస్థలపై ప్రభావం చూపినట్టు నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇదేమంత ఆందోళన చెందాల్సిన అంశం కాదని, పరిస్థితులు కుదుటపడితే, భారీగా జీఎస్టీ వసూళ్లు వస్తాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కాగా ఇప్పటివరకు అత్యధిక మొత్తంలో జీఎస్టీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నమోదైంది. ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో రూ.1.41 లక్షల కోట్లు వసూలు కాగా, మే నెలలో రూ.1.02 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది.
GST Collections
Finance Ministry
June
India
Corona Second Wave

More Telugu News