Lalu Prasad Yadav: జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత తొలిసారి ప్రజల ముందుకు లాలు.. కీలక వ్యాఖ్యలు

  • చావడానికైనా సిద్ధం.. తగ్గేది మాత్రం లేదు
  • గత ఎన్నికల్లో తేజస్వి అద్భుత ప్రతిభను కనబరిచాడు
  • త్వరలోనే ఆట మొదలు పెడతా
I am ready to die warns Lalu Prasad Yadav

అవినీతి కేసుల్లో రాంచీలోని జైల్లో శిక్షను అనుభవించిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ బెయిల్ మీద విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు. ఆర్జేడీని స్థాపించి 25 ఏళ్లు అయిన సందర్భంగా పార్టీ శ్రేణులను, అభిమానులను ఉద్దేశించి ఆయన వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. తాను బతికి ఉండటానికి తన కుమారుడు తేజస్వి యాదవే కారణమని లాలు అన్నారు. ఎన్డీయే భాగస్వామి అయిన నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.

గత ఎన్నికల్లో తేజస్వి  యాదవ్ అద్భుత పోరాటం చేశాడని... ఈ స్థాయిలో అతను రాణిస్తాడని తాను కనీసం ఊహించలేదని లాలు అన్నారు. ఆర్జేడీ అనే నావను తేజస్వి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారని ప్రశంసించారు. తన కొడుకుని చూసి గర్విస్తున్నానని అన్నారు. ఆర్జీడీకి ఘనమైన భవిష్యత్తు ఉందని చెప్పారు. త్వరలోనే తాను మళ్లీ ఆట మొదలు పెడతానని లాలు అన్నారు. తాను చావడానికైనా సిద్ధమేనని... వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రత్యర్థులను హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం, బీహార్ లోని నితీశ్ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమయ్యాయని లాలు విమర్శించారు. డీమానిటైజేషన్, జీఎస్టీ, కరోనాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాయని అన్నారు. అయోధ్య తర్వాత ఇప్పుడు మధుర గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐదుగురు ప్రధానమంత్రులను తయారు చేసే శక్తి తనకు ఉందని లాలు అన్నారు. పార్లమెంటు ఉభయసభల్లో తమ సభ్యులు బలంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే తాను పాట్నాకు వస్తానని... బీహార్ లోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని అన్నారు.

More Telugu News