Andhra Pradesh: కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం... థియేటర్లకు అనుమతి

  • ఏపీలో తగ్గుతున్న కరోనా వ్యాప్తి
  • వైద్య ఆరోగ్యశాఖతో సీఎం జగన్ సమీక్ష
  • ఉభయ గోదావరి జిల్లాల్లో ఆంక్షల సడలింపు
  • ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు సడలింపు
AP Govt changes curfew timings in Godavari districts

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో ఏపీ సర్కారు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కర్ఫ్యూ సడలింపు సమయాల్లో మార్పులు చేసింది. ఇటీవలి వరకు కేసులు అధికంగా వచ్చిన ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆ రెండు జిల్లాల్లోనూ సడలింపు సమయాలు మార్చుతున్నట్టు ప్రకటించింది.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ నమోదయ్యేంత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

మిగతా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈ జిల్లాల్లో రాత్రి 9 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి ఉంటుందని ఆదేశించారు.

50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు, జిమ్ లు, కల్యాణ మండపాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ సీట్ల మధ్య ఖాళీలతో సినిమా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఈ సడలింపులు ఈ నెల 8వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

More Telugu News