Saina Nehwal: యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై సైనా నెహ్వాల్ ట్వీట్... తీవ్రస్థాయిలో విమర్శలు

  • గతేడాది బీజేపీలో చేరిన సైనా
  • యోగి సర్కారుకు అభినందనలు
  • అద్భుత విజయం సాధించారని ట్వీట్
  • సర్కారీ షట్లర్ అంటూ నేతల విమర్శలు
Saina Nehwal appreciates BJP win in UP Panchayat Elections

ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులే అత్యధిక సంఖ్యలో విజయాలను అందుకున్నారు. దాంతో యూపీ బీజేపీ వర్గాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయితే, యూపీ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్ విమర్శలకు దారితీసింది. జిల్లా పంచాయత్ చైర్ పర్సన్ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు అంటూ సైనా ట్వీట్ చేసింది. సైనా ట్వీట్ పై విపక్షాలు విరుచుకుపడ్డాయి.

'సర్కారీ షట్లర్' (ప్రభుత్వ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి) అంటూ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయంత్ చౌదరి విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ధ్వంసం చేయడంలో బీజేపీ నైపుణ్యాన్ని ఈ 'సర్కారీ షట్లర్' గుర్తించారని వ్యంగ్యం ప్రదర్శించారు. తమ నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు ప్రయత్నిస్తుండడంపై ఓటర్లు 'డ్రాప్ షాట్' (బ్యాడ్మింటన్ లో ఓ రకమైన షాట్) ప్రయోగించాల్సిన అవసరం ఉందని జయంత్ చౌదరి అభిప్రాయపడ్డారు.

ఇక తమిళనాడు కాంగ్రెస్ మైనారిటీ విభాగం చైర్మన్ డాక్టర్ అస్లామ్ బాషా కూడా సైనా ట్వీట్ పై స్పందించారు. "సెక్యులరిజం మీ అభిమానుల మధ్య విభేదాలకు కారణమైంది... ఆడడాన్ని ఎందుకు ఆపేయాలనుకుంటున్నారు?" అని ప్రశ్నించారు. బ్యాడ్మింటన్ లో అంతర్జాతీయ స్థాయిలో అనేక విజయాలు అందుకున్న సైనా గతేడాది బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

More Telugu News