Mandeep Singh: ఆన్ లైన్ క్లాసులకు ఫోన్ లేదు... టెన్త్ లో 98 శాతం మార్కులు తెచ్చుకున్న కశ్మీర్ బాలుడు

  • జిల్లాస్థాయి టాపర్ గా కశ్మీర్ బాలుడు మన్ దీప్
  • మన్ దీప్ తండ్రి రైతు
  • ఇంట్లో ఉండి చదివి 98 శాతం మార్కులు
  • భవిష్యత్తులో డాక్టర్ అవ్వాలని ఆకాంక్ష
Kashmir teenager Mandeep gets top rank in Tenth class without a phone to attend online classes

ఈ బాలుడి పట్టుదల ముందు పేదరికం కూడా తలవంచింది. ఆన్ లైన్ క్లాసులు వినడానికి ఫోన్ లేకపోయినా, ఎంతో కష్టపడి చదివిన ఆ బాలుడు పదో తరగతి పరీక్షల్లో 98 శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. జమ్మూకశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లా ఆమ్రోహ్ గ్రామానికి చెందిన మన్ దీప్ సింగ్ ఇటీవల విడుదలైన టెన్త్ క్లాస్ ఫలితాల్లో 98.06 శాతం మార్కులు తెచ్చుకుని జిల్లా స్థాయిలో టాపర్ గా నిలిచాడు.

లాక్ డౌన్ కారణంగా స్కూలుకు వెళ్లలేకపోయిన మన్ దీప్ కేవలం పాఠ్యపుస్తకాలే గురువులుగా శ్రమించి, అందుకు తగ్గ ఫలితాన్ని అందుకున్నాడు. మన్ దీప్ తండ్రి శ్యామ్ సింగ్ ఓ రైతు కాగా, తల్లి సంధ్యా దేవి గృహిణి. వీరి ఇంట్లో కంప్యూటర్ కాదు కదా, కనీసం స్మార్ట్ ఫోన్ కూడా లేదు. దాంతో మిగతా విద్యార్థుల్లా మన్ దీప్ ఆన్ లైన్ క్లాసులు వినలేకపోయాడు. తండ్రికి పొలం పనుల్లో చేదోడువాదోడుగా ఉంటూనే మన్ దీప్ జిల్లా స్థాయి ర్యాంకర్ గా నిలవడం విశేషం.

తన ఘనతకు ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయులే కారణమని మన్ దీప్ పేర్కొన్నాడు. వారే తనకు చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చారని వినమ్రంగా వెల్లడించాడు. గ్రామంలో సరైన విద్యుచ్ఛక్తి సదుపాయాలు కూడా లేవని, ఈ క్రమంలో తన సోదరుడు ఎంతో సాయపడ్డాడని తెలిపాడు. మన్ దీప్ అన్నయ్య షేర్ ఏ కశ్మీర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంటివద్ద ఉన్న సమయంలో తన సోదరుడు మన్ దీప్ కు చదువుల్లో సాయపడ్డాడు.

ఇక మన్ దీప్ మున్ముందు నీట్ రాసి డాక్టర్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నాడు. కాగా, తమ పిల్లవాడికి జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు రావడం పట్ల మన్ దీప్ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.

More Telugu News