సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల దర్యాప్తు తీరుపై హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిల్

03-07-2021 Sat 20:49
  • జగన్ అక్రమాస్తులపై సీబీఐ, ఈడీ దర్యాప్తు
  • దర్యాప్తు సరిగా సాగడంలేదన్న రఘురామ
  • దృష్టికి వచ్చిన అంశాలు వదిలేశారని ఆరోపణ
  • అన్ని అంశాలపై దర్యాప్తు చేయాలన్న రఘురామ
Raghurama files PIL in Telangana high court
సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ విచారణ సరిగా సాగడం లేదంటూ నరసాపురం ఎంపీ రఘురామరాజు తెలంగాణ హైకోర్టులో పిల్ వేశారు. దర్యాప్తులో గుర్తించిన అన్ని అంశాలపైనా విచారణ జరిపేలా సీబీఐ, ఈడీలను ఆదేశించాలని రఘురామ న్యాయస్థానాన్ని కోరారు. దర్యాప్తు సందర్భంగా తమ దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ఈ రెండు సంస్థలు వదిలివేశాయని తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో వివరించారు. జగన్ అక్రమాస్తుల కేసులకు సహేతుకమైన ముగింపు ఇవ్వడంలో సీబీఐ, ఈడీ విఫలం అయ్యాయని పేర్కొన్నారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే రఘురామకు, ఆ పార్టీ ఇతర నేతలకు మధ్య విభేదాలు పొడసూపాయి. అవి రాన్రాను రఘురామ వర్సెస్ వైసీపీ అధినాయకత్వం అన్నట్టుగా మారాయి. ఇటీవల రఘురామను ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం వాటికి పరాకాష్ఠగా చెప్పొచ్చు. బెయిల్ పై బయటికి వచ్చినప్పటి నుంచి రఘురామ తన పోరాటాన్ని తీవ్రతరం చేశారు. సీఎం జగన్ కు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. న్యాయస్థానాల ద్వారానూ తన పోరాటం సాగిస్తున్నారు.