Twitter: ప్రత్యేక అధికారి నియామకం చివరి దశలో ఉంది: ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన ట్విట్టర్

  • గ్రీవెన్స్ అధికారి నియామకంపై కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం
  • తాత్కాలిక అధికారితో నెట్టుకొస్తున్న ట్విట్టర్
  • పూర్తిస్థాయి అధికారి ఉండాల్సిందేనంటున్న కేంద్రం
  • భారత్ లో నివసించే వ్యక్తి అయ్యుండాలని స్పష్టీకరణ
Twitter told Delhi high court that grievance officer recruitment is in final stage

నూతన ఐటీ చట్టం ప్రకారం ట్విట్టర్ ప్రత్యేకంగా గ్రీవెన్స్ అధికారిని నియమించాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పడం తెలిసిందే. కాగా, ఈ వ్యవహారం ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. కేంద్ర ఐటీ చట్టాన్ని ఎందుకు పాటించరంటూ ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ట్విట్టర్ కు నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదులు పరిష్కరించే గ్రీవెన్స్ అధికారి నియామకంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని గత విచారణలో స్పష్టం చేసింది.

ఈ క్రమంలో ట్విట్టర్ నేడు ఢిల్లీ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. గ్రీవెన్స్ కోసం పూర్తిస్థాయి అధికారిని నియమించే ప్రక్రియ చివరి దశలో ఉందని వెల్లడించింది. ఇటీవల ధర్మేంధ్ర చతుర్ ఈ ఉద్యోగం నుంచి తప్పుకున్న నేపథ్యంలో తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిని నియమించామని ట్విట్టర్ కోర్టుకు వివరించింది.

గ్రీవెన్స్ అధికారి బాధ్యతలకు ధర్మేంద్ర చతుర్ రాజీనామా చేసిన తర్వాత ట్విట్టర్ తన గ్లోబల్ పాలసీ డైరెక్టర్ జెరెమీ కెస్సెల్ ను భారత్ లో నూతన గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. జెరెమీ కెస్సెల్ కాలిఫోర్నియాలో నివసిస్తుంటారు. అయితే, భారత్ లో ఫిర్యాదుల పరిష్కారానికి ఇక్కడ నివసించే వ్యక్తినే గ్రీవెన్స్ అధికారిగా నియమించాలంటూ కేంద్రం నూతన ఐటీ చట్టాన్ని ఉదహరిస్తూ ట్విట్టర్ కు స్పష్టం చేసింది.

More Telugu News