Sri Lanka: ఇంగ్లండ్​ తో వన్డే: శ్రీలంక పరమ చెత్త రికార్డు

Srilanka Now Stands At first as it loses most matches in ODIs
  • అత్యధిక వన్డేలు ఓడిన జట్టుగా రికార్డ్
  • 428 ఓటములతో మొదటి స్థానం
  • టీ20లోనూ 70 ఓటములతో ఫస్ట్
శ్రీలంక అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. వన్డేల్లో ఎక్కువ మ్యాచ్ లు ఓడిపోయిన టీమ్ గా నిలిచింది. ఇంగ్లండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో శ్రీలంక ఓటమిపాలైంది. దీంతో ఆ దేశం జాబితాలో 428 పరాజయాలు వచ్చి చేరాయి. ఇప్పటిదాకా 858 మ్యాచ్ లను శ్రీలంక ఆడింది. అందులో 390 విజయాలను నమోదు చేసింది.

ఈ జాబితాలో శ్రీలంక తర్వాత భారత్ ఉండడం గమనార్హం. నిన్నటి వరకు అత్యధిక వన్డే మ్యాచ్ లు ఓడిపోయిన జట్లుగా భారత్, శ్రీలంకలు సమానంగా నిలిచాయి. భారత్ మొత్తంగా ఇప్పటిదాకా 993 మ్యాచ్ లు ఆడి 427 ఓడిపోయింది. గెలుపు రేటు పరంగా చూస్తే శ్రీలంక కన్నా భారత్ మెరుగైన స్థానంలోనే ఉంది. 54.67 శాతం మ్యాచ్ లను టీమిండియా గెలిస్తే.. కేవలం 47.69 శాతం మ్యాచ్ లను శ్రీలంక గెలిచింది. ఈ విషయంలో పాకిస్థాన్ 414 ఓటములతో మూడో స్థానంలో ఉంది.  

ఇటు టీ 20లోనూ అత్యధిక మ్యాచ్ లు ఓడిపోయిన జట్టుగా శ్రీలంకే ఉంది. మొత్తం 70 మ్యాచ్ లను ఆ టీమ్ చేజార్చుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్ 67 మ్యాచ్ లు, పాకిస్థాన్ 65 మ్యాచ్ లు ఓడిపోయాయి. ఒకప్పటిలా శ్రీలంక జట్టు ఇప్పుడు పటిష్ఠంగా లేదు. సంగక్కర, జయవర్ధనే, దిల్షాన్ వంటి ఆటగాళ్ల తరం వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు ఆ జట్టు ఆట దారుణంగా తయారైంది.

ప్రస్తుతం జులై 13 నుంచి ఆరంభం కాబోతున్న సిరీస్ లో శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత్ ను ఆ జట్టు ఎదుర్కోబోతోంది. మరి, ఆ సిరీస్ లో జట్టు ఆట ఎలా ఉంటుందో ఓ లుక్కేయాల్సిందే!
Sri Lanka
Team India
ODI
Team England

More Telugu News