Bipin Rawat: పాకిస్థాన్ ను డ్రోన్ లతో దాడి చేయనివ్వండి... అప్పుడేం జరుగుతుందో చూడండి: సీడీఎస్ బిపిన్ రావత్

  • ఇటీవల జమ్మూలో డ్రోన్ దాడులు
  • ఆపైనా పలుమార్లు డ్రోన్ కలకలం
  • ఓ వెబినార్ లో రావత్ స్పందన
  • సమయం, సందర్భం చూసి దెబ్బకొడతామని వెల్లడి
CDS Bipin Rawat reacts to drone attacks in Jammu

భారత త్రివిధ దళాల సంయుక్త చీఫ్ బిపిన్ రావత్ జమ్మూకశ్మీర్ లో డ్రోన్ దాడుల కలకలంపై స్పందించారు. హైబ్రిడ్ యుద్ధంలో భాగంగా పాకిస్థాన్ గనుక డ్రోన్ దాడులకు దిగితే తాము సమయం, సందర్భం చూసి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. "భారత పౌర ఆవాసాలపైనా, సైనిక స్థావరాలపైనా పాకిస్థాన్ ను దాడులు చేయనివ్వండి... అప్పుడేం జరుగుతుందో చూడండి" అని తమ ఉద్దేశాన్ని స్పష్టం చేశారు.

ఇటీవల జమ్మూలో జరిగిన డ్రోన్ దాడుల వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటో స్పష్టంగా తెలియదని అన్నారు. ఒకవేళ పాకిస్థాన్ ఇకపైనా అలాంటి దాడులే చేయాలని అనుకుంటే మాత్రం భారత సైన్యం స్పందన చాలా విభిన్నంగా ఉంటుందని రావత్ పేర్కొన్నారు. "రాజకీయ సంకల్పం కూడా అదే. గట్టిగా బుద్ధి చెప్పేందుకు మన సైన్యం సిద్ధంగా ఉంది" అని స్పష్టం చేశారు.

మన భూభాగంపై నష్టం కలిగించేలా పాకిస్థాన్ డ్రోన్ దాడులు చేస్తే... ఎక్కడ, ఎప్పుడైనా దాడి చేసే అవకాశం మనకు లభించినట్టేనని పేర్కొన్నారు. ఇలాంటి డ్రోన్ దాడులను కూడా సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి విఘాతం కలిగించే చర్యలుగానే భావించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఓ వెబినార్ లో పాల్గొన్న సందర్భంగా రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News