Afghanistan: మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లొద్దు.. మగాళ్లు గడ్డం తీయొద్దు: ఆఫ్ఘన్​ లో పెరిగిన తాలిబన్ల ఆగడాలు

Talibans Passing Their Own Laws and Diktats Occupied 100 districts
  • 400 జిల్లాల్లో 100 జిల్లాలు ఉగ్రమూకల వశం
  • ఉగ్రచట్టాలను అమలు చేస్తున్న తాలిబన్లు
  • వరుడి కుటుంబానికి వధువు కట్నం ఇవ్వాల్సిందే
  • ఆసుపత్రులు, స్కూళ్లన్నీ మూత
  • పెరిగిన ఆహార ధరలు.. ప్రజల ఆందోళన 
అమెరికా సహా నాటో బలగాలన్నీ వెనుదిరిగిపోవడంతో ఆఫ్ఘనిస్థాన్ క్రమక్రమంగా తాలిబన్ ఉగ్రమూకల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇప్పటిదాకా జరిగిన కాస్తోకూస్తో అభివృద్ధినీ ఉగ్రవాదులు నాశనం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను చేజిక్కించుకున్న తాలిబన్లు.. తాజాగా కపిసా ప్రావిన్స్ లోని తాగబ్ జిల్లాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 400 జిల్లాల్లోని 100 జిల్లాలను వశపరచుకున్నట్టు తాలిబన్లు ప్రకటించారు. ఆయా జిల్లాల్లో తమ నిబంధనలు, తాలిబన్ ఉగ్ర చట్టాలను అమలు చేస్తున్నారు.

మహిళలు భర్త లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, మగవాళ్లు కచ్చితంగా గడ్డం పెంచాలని, గడ్డం తీయకూడదని తఖర్ ప్రావిన్స్ లో దిక్తత్ లు పాస్ చేశారు. అంతేగాకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే వరుడి కుటుంబానికి కచ్చితంగా కట్నం ఇవ్వాల్సిందేనన్న నిబంధననూ పెట్టారని అక్కడి పౌర హక్కుల సంస్థలు చెబుతున్నాయి. ఒకవేళ ఎవరైనా నియమాలను కట్టుదప్పితే ఎలాంటి ఆధారాలు లేకున్నా శిక్షలు వేస్తున్నారని మిరాజుద్దీన్ షరీఫీ అనే పౌర హక్కుల కార్యకర్త చెప్పారు.

తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ప్రాంతాల్లో తిండికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని తఖర్ ప్రావిన్స్ కౌన్సిల్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలన్నీ బంద్ అయిపోయాయని మహ్మద్ ఆజం అఫ్జాలీ అనే కౌన్సిల్ మెంబర్ చెప్పారు. ఆసుపత్రులు, స్కూళ్లు అన్నీ మూతపడ్డాయని ఆవేదన చెందారు. ఇప్పటికే చాలా ప్రభుత్వ ఆఫీసులను తాలిబన్ ఉగ్రమూకలు కూల్చేశాయని తఖర్ ప్రావిన్స్ గవర్నర్ అబ్దుల్లా ఖర్లూఖ్ చెప్పారు. అన్నింటినీ దోచేశారని, అక్కడ సేవలందించేందుకు ఏమీ మిగల్లేదని చెప్పారు.

ఇక, నాటో బలగాలు వెళ్లిపోతే ఆఫ్ఘనిస్థాన్ మరింత వెనక్కు వెళ్లిపోతుందని మేలోనే అమెరికా జాతీయ నిఘా మండలి నిపుణులు హెచ్చరించారు. మహిళా హక్కులన్నీ కాలగర్భంలో కలుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్లు దేశం మొత్తాన్ని చేజిక్కించుకుంటారని చెప్పారు. 
Afghanistan
Taliban
NATO

More Telugu News