ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న కోహ్లీ!

02-07-2021 Fri 13:45
  • ఇండియాలో ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోయర్లను కలిగిన కోహ్లీ
  • ఒక్కో పోస్టుకు రూ. 5 కోట్లు వసూలు చేస్తున్న టీమిండియా కెప్టెన్
  • అత్యధికంగా రూ. 11 కోట్లు వసూలు చేస్తున్న రొనాల్డో
Kohli charges RS 5 cr for each instagram post
ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన క్రికెటర్లలో ఒకడైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ఆయన సంపాదన వందల కోట్ల రూపాయలకు చేరుకుంది. క్రికెట్, యాడ్స్ ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కోహ్లీ భారీగా సంపాదిస్తున్నాడు. ఇన్ట్స్టాగ్రామ్ లో తాను చేసే ఒక్కో పోస్టుకు కోహ్లీ రూ. 5 కోట్లు వసూలు చేస్తున్నాడట. ఈ విషయాన్ని హాపర్ హెచ్ క్యూ సంస్థ వెల్లడించింది.

ఇండియాలో ఇన్స్టాగ్రామ్ లో కోహ్లీకే అత్యధికంగా ఫాలోయర్లు ఉన్నారు. ఇన్స్టాలో అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల్లో కోహ్లీ 19వ స్థానంలో ఉన్నాడు. టాప్ 20లో ఉన్న ఏకైక ఇండియన్ సెలబ్రిటీ కోహ్లీనే కావడం గమనార్హం. 27వ స్థానంలో ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఒక్కో పోస్టుకు రూ. 3 కోట్లు వసూలు చేస్తోందట.

ఈ జాబితాలో పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉన్నాడు. ఒక్కో పోస్టుకు రొనాల్డో రూ. 11 కోట్లు వసూలు చేస్తాడట. రొనాల్డోతో సమానంగా హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ కూడా వసూలు చేస్తున్నాడు. అయితే, 395 మంది సెలబ్రిటీలు ఉన్న ఈ జాబితాలో మరో ఇండియన్ క్రికెటర్ లేకపోవడం గమనార్హం.