వెంకీ .. రవితేజ ప్రాజెక్టులు ఆగలేదన్న డైరెక్టర్!

30-06-2021 Wed 18:13
  • రవితేజ కోసం కథ రెడీ
  • వెంకీతో కథా చర్చలు
  • రెండు ప్రాజెక్టులు ఉన్నాయి
  • కరోనా వల్లనే ఆలస్యం  
Trinadha Rao said about his latest movies
ఇటు యూత్ పల్స్ .. అటు మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుల జాబితాలో నక్కిన త్రినాథరావు ఒకరు. ఒక కథలో ఏయే అంశాలు ఎంతవరకూ ఉండాలనే విషయం ఆయనకి బాగా తెలుసు. ఇంతకుముందు ఆయన తెరకెక్కించిన 'సినిమా చూపిస్త మావ' .. 'నేను లోకల్' సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇదే జోరుమీద ఆయన 'హలో గురూ ప్రేమ కోసమే' చేశారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తరువాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.

వెంకటేశ్ హీరోగా కూడా ఆయన ఒక సినిమాను చేయనున్నట్టు చెప్పుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఆగిపోయాయని ప్రచారం కూడా ఇటీవల జోరందుకుంది. ఈ విషయంపై త్రినాథరావు స్పందిస్తూ, రవితేజ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఆయన ఎప్పుడంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్లొచ్చు. ఇక వెంకటేశ్ తో ప్రాజెక్టు కూడా ఆగలేదు. ఆ కథ క్లైమాక్స్ గురించిన చర్చలు నడుస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు తప్పకుండా ఉంటాయి .. కరోనా వలన ఆలస్యమయ్యాయి అంతే" అంటూ ఆయన క్లారిటీ ఇచ్చేశాడు.