India: పాక్​ ప్రభుత్వమే డ్రోన్లను సమకూర్చి ఉండొచ్చు: ఆర్మీ లెఫ్టినెంట్​ జనరల్​

  • ఇవి రోడ్డుపక్కన తయారయ్యేవి కావు
  • ఆ దేశం మద్దతుతోనే డ్రోన్లతో ఉగ్రదాడులు
  • వాటిని ఎదుర్కొనేందుకు మేం సదా సిద్ధం
Drones Not Made On Roads Are State Supported Systems say Top Army Officer

జమ్మూ విమానాశ్రయంలోని ఎయిర్ బేస్ పై దాడికి వాడిన డ్రోన్లను పాకిస్థాన్ ప్రభుత్వమే సమకూర్చి ఉంటుందని 15 కోర్ కు చెందిన కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డి.పి. పాండే అన్నారు. ఉగ్రవాదులు దాడికి పాల్పడిన తీరు చూస్తుంటే అదే నిజమనిపిస్తోందని చెప్పారు. ఇలాంటి డ్రోన్లు, వాటి సాంకేతికతపై తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఇలాంటి ముప్పు భవిష్యత్ లో మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

దాడికి ఉగ్రవాదులు వాడిన ఈ డ్రోన్లు అల్లాటప్పాగా రోడ్డు పక్కన తయారు చేసినవి కాదని అన్నారు. కచ్చితంగా దానికి పొరుగు దేశ ప్రభుత్వ మద్దతు ఉందని చెప్పారు. స్థానికంగా ఉన్న డ్రోన్లను దాడులకు వినియోగించేలా వాటిలో మార్పులు చేసేందుకు ఆ దేశ ప్రభుత్వ వర్గాలు సహకరించి ఉండొచ్చన్నారు.

 జాతీయ భద్రతకు ఇలాంటి వాటి వల్ల ముప్పు వాటిల్లకుండా ఎదుర్కొనేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. వాటిని ఎదుర్కొనేందుకు పరిష్కారాల గురించి ఆలోచిస్తున్నామన్నారు. గత నాలుగైదేళ్లుగా కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితులు చాలా బాగున్నాయని చెప్పారు. లోయలో స్థిరత్వం ఏర్పడుతున్న సమయంలోనే ప్రతిసారీ దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. రకరకాలుగా రెచ్చొగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. 

More Telugu News