వైఎస్సార్ పై వ్యాఖ్యలను తెలంగాణ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నాం: ఏపీ మంత్రి అనిల్

28-06-2021 Mon 16:54
  • ఏపీ, తెలంగాణ నీటి వివాదంలో వైఎస్ పై వ్యాఖ్యలు
  • వైఎస్ ను విమర్శిస్తున్న తెలంగాణ మంత్రులు
  • నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఏపీమంత్రి అనిల్ వెల్లడి
  • సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని వివరణ
AP minister Anil Kumar slams Telangana ministers for their remarks on YSR
నీటి ప్రాజెక్టుల అంశంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణంగానే తెలంగాణకు అన్యాయం జరిగిందని, తెలంగాణ నీటిని ఏపీకి దోచుకెళ్లిన దొంగ, నరరూపరాక్షసుడు అంటూ తెలంగాణ నేతలు వ్యాఖ్యానిస్తుండడంపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. తెలంగాణ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వైఎస్సార్ పై వ్యాఖ్యలను తెలంగాణ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం సక్రమేనని వెల్లడించారు. ఆర్డీఎస్ పై తెలంగాణ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు సీఎం జగన్ కృషి చేస్తారని తెలిపారు. పోతిరెడ్డిపాడును వెడల్పు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. అపెక్స్ కౌన్సిల్ లో తెలంగాణ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

రాష్ట్ర హక్కుగా రావాల్సిన నీటినే వాడుకుంటున్నామని అనిల్ స్పష్టం చేశారు. తాము అక్రమంగా ఎలాంటి ప్రాజెక్టును నిర్మించడంలేదని వివరించారు. తెలంగాణలో పాలమూరు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులు అక్రమంగా కట్టినవేనని ఆరోపించారు. నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని అనిల్ పేర్కొన్నారు.