మహిళలతో కలిసి అల్పాహారం స్వీకరించిన కేటీఆర్

26-06-2021 Sat 12:18
  • హుస్సేన్ సాగర్ సమీపంలో డబుల్ బెడ్రూమ్ లను ప్రారంభించిన కేటీఆర్
  • బోనాలతో స్వాగతం పలికిన మహిళలు
  • పైసా ఖర్చు లేకుండా ఇళ్లను అందిస్తున్నామన్న కేటీఆర్
KTR had breakfast with women

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ లో కొత్తగా నిర్మించిన 330 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కేటీఆర్ అల్పాహారం తీసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎలా ఉందని మహిళలను అడిగి తెలుసుకున్నారు. తమకు అద్భుతమైన ఇళ్లను నిర్మించి ఇచ్చారని మహిళలు ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై కేటీఆర్ ప్రసంగిస్తూ... డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఆనందం చూస్తుంటే తన గుండె ఉప్పొంగిపోయిందని అన్నారు. ఈ ఇళ్ల నిర్మాణంతో అంబేద్కర్ నగర్ రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రైవేట్ అపార్ట్ మెంట్ ధర కోటిన్నర వరకు ఉంటుందని... కానీ, కేసీఆర్ ఒక్క పైసా కూడా లేకుండానే ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇచ్చారని తెలిపారు. పేదల కోసం ఇళ్లను కట్టించి ఇస్తున్న ప్రభుత్వం దేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని చెప్పారు. ఇళ్ల పంపిణీ పారదర్శకంగా సాగుతోందని అన్నారు.