Sharad Pawar: బీజేపీని ఎదుర్కోవడానికి ఏ ఫ్రంట్ ఏర్పాటు చేసినా కాంగ్రెస్ ఉండాల్సిందే: శరద్ పవార్

Sharad Pawar says Congress will be need to face BJP
  • థర్డ్ ఫ్రంట్ పై పవార్ అభిప్రాయాలు
  • కాంగ్రెస్ బలమైన శక్తి అని వెల్లడి
  • రాజకీయాల్లో కాంగ్రెస్ అవసరమని ఉద్ఘాటన
  • కాంగ్రెస్ ను విస్మరించలేమని స్పష్టీకరణ
ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో వరుస భేటీలు నిర్వహిస్తూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దేశ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రశాంత్ కిశోర్ తో పవార్ భేటీలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో పవార్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దేశంలో బీజేపీని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ చేయూత ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఏ ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేసినా, కాంగ్రెస్ ను విస్మరించలేమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లేని ఫ్రంట్ లతో ఉపయోగంలేదని పరోక్షంగా తేల్చి చెప్పారు. థర్డ్ ప్రంట్ ఏర్పాటుపై జరుగుతున్న ప్రచారం పట్ల స్పందిస్తూ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇప్పటివరకు కూటమి గురించి తమ సమావేశాల్లో చర్చకు రాలేదని, ఒకవేళ ఏదైనా ప్రత్యామ్నాయ శక్తి ఏర్పడితే అందులోకి కాంగ్రెస్ ను తీసుకోవడం తథ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ వంటి బలీయమైన శక్తి రాజకీయాల్లో అవసరమని పవార్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏ ఫ్రంట్ రూపుదిద్దుకున్నా సమష్టి నాయకత్వం ఉండాలని అన్నారు. ఒకవేళ మీరు ఫ్రంట్ కు నాయకత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు ఆయన జవాబిస్తూ... "శరద్ పవార్ గతంలో ఇలాంటివి చాలాసార్లు ప్రయత్నించి చూశారు" అంటూ చమత్కరించారు. 
Sharad Pawar
Congress
Third Front
BJP
India

More Telugu News