Sutha Sivanatham: తాను లేకుండా బతకలేదని... కన్నబిడ్డనే కడతేర్చింది!

Indian origin woman killed her five old daughter

  • బ్రిటన్ లో ఘటన
  • కరోనా భయంతో ఘాతుకం
  • ఐదేళ్ల కుమార్తెను పొడిచి చంపిన భారత సంతతి మహిళ
  • ఆపై ఆత్మహత్యాయత్నం

బ్రిటన్ లో భారత సంతతికి చెందిన ఓ మహిళ కన్నబిడ్డనే చంపుకున్న వైనం తాజాగా వెల్లడైంది. గతేడాది జులైలో జరిగిందీ ఘటన. ఆమె పేరు సుధా శివనాథం. సౌత్ లండన్ లో నివసించే 36 ఏళ్ల సుధా శివనాథం కరోనా అంటే విపరీతంగా ఆందోళనకు గురయ్యేది. కరోనాతో చనిపోయిన వారి వివరాలు మీడియాలో చూసి భయంతో వణికిపోయేది. ఒకవేళ తాను కూడా కరోనాతో చనిపోతే, తన ఐదేళ్ల కుమార్తె సాయగిని ఎవరు చూసుకుంటారన్న ఆలోచనతో ఉన్మాదానికి గురైంది.

తాము లేకుండా కుమార్తె బతకలేదని నిశ్చయించుకుని తీవ్ర నిర్ణయం తీసుకుంది. కుమార్తె సాయగి బెడ్ రూంలో ఉండగా కత్తితో దాడి చేసింది. ఆ చిన్నారిని అత్యంత కిరాతకంగా పొడిచి చంపింది. చిన్నారి ఒంటిపై 15 కత్తిపోట్లు ఉన్నాయంటే, ఆ తల్లి ఎంత కర్కశంగా హత్య చేసిందో అర్థమవుతుంది. ఆపై సుధ తాను కూడా కత్తితో పొడుచుకుంది. రెండు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత ఆమెను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

దీనిపై ఆమె భర్త స్పందిస్తూ, కరోనా పేరు చెబితేనే భరించలేకపోయేదని, లాక్ డౌన్ ఆంక్షలతో ఆమె మరింత మానసిక సంక్షోభంలో కూరుకుపోయిందని వివరించాడు. కాగా, ఆమెను పోలీసులు కోర్టులో హాజరు పర్చగా, తాను హత్య చేయలేదని, బాధ్యత ప్రకారం చేయాల్సింది చేశానని వెల్లడించింది.

సుధా శివనాథం 2006 నుంచి లండన్ లో ఉంటోంది. ఆమెది పెద్దలు కుదిర్చిన పెళ్లి. గత కొంతకాలంగా ఆమె తీవ్ర మానసిక సమస్యలతో బాధపడేది. తానేదో తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నట్టు ఊహించుకుని కుంగిపోయేది. హత్య జరిగిన రోజు కూడా భర్తను ఆఫీసుకు వెళ్లవద్దని కోరింది.

సుధా శివనాథం మానసిక వ్యాధితో బాధపడుతూ ఈ ఉన్మాద చర్యకు పాల్పడినట్టు గుర్తించిన కోర్టు... మానసిక ఆరోగ్య చట్టంలోని సెక్షన్ 37, 41 కింద ఆసుపత్రిలో చికిత్సకు తరలించింది.

Sutha Sivanatham
Murder
Sayagi
Daughter
South London
Corona Pandemic
  • Loading...

More Telugu News