85 దేశాలకు ప్రబలిన డెల్టా వేరియంట్.. ఆల్ఫా కంటే 1.23 రెట్లు పవర్‌ఫుల్! 

25-06-2021 Fri 08:22
  • ప్రపంచానికి పెనుముప్పుగా మారిందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
  • డెల్టా బాధితుల్లో మరణాలే ఎక్కువని తేల్చిన అధ్యయనం
  • 170 దేశాల్లో ఆల్ఫా వేరియంట్
Corona Virus Delta Variant More Powerful Than Alphna variant

కరోనా వైరస్ వేరియంట్లలో అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న డెల్టా వేరియంట్ ఇప్పటి వరకు 85 దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. గత రెండు వారాల్లోనే 11 దేశాల్లో ఇది బయటపడిందని, ఇది ఇలాగే కొనసాగుతూ పోతే ప్రపంచానికి పెను ముప్పుగా మారుతుందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.

 గతంలో వెలుగుచూసిన ఆల్ఫా కంటే ఈ వేరియంట్ 1.23 రెట్ల వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు జపాన్ అధ్యయనంలో తేలింది. డెల్టా వైరస్ సోకిన బాధితులకు ఆక్సిజన్ అవసరం, ఐసీయూలో చేరిక, మరణాలు ఎక్కువగా ఉన్నట్టు సింగపూర్ అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో కరోనా వైరస్ విజృంభణకు ఇదే కారణమని చెబుతున్నారు.

కాగా, డెల్టా వేరియంట్ వెలుగు చూడడానికి ముందు ఆల్ఫా, బీటా, గామా వేరియంటులను ‘ఆందోళనకర’ రకాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇప్పుడా స్థానంలో డెల్టా వేరియంట్ వచ్చి చేరింది. ప్రస్తుతం ఆల్ఫా వేరియంట్ 170 దేశాల్లో, బీటా రకం 119 దేశాల్లో, గామా వేరియంట్ 71 దేశాల్లోనూ ఉనికిలో వున్నాయి.