మొన్న దుబ్బాక... రేపు హుజూరాబాద్... ఫలితంలో మార్పు ఉండదన్న రఘునందన్ రావు

24-06-2021 Thu 16:18
  • హుజూరాబాద్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు
  • త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక
  • ఇటీవలే బీజేపీలో చేరిన ఈటల
  • ఈటల గెలుపును  ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ
BJP MLA RaghunandanRao confidant on Huzurabad by polls win

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరగనుంది. ఈటల కొన్నిరోజుల కిందటే బీజేపీలో చేరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈటలను మళ్లీ గెలిపించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.

దీనిపై దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు స్పందించారు. హుజూరాబాద్ లో ఈటల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మొన్న దుబ్బాకలో ఎలాంటి ఫలితం వచ్చిందో, రేపు హుజూరాబాద్ లోనూ అదే పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. అయితే, బీజేపీ శ్రేణులు దుబ్బాక కంటే కాస్త ఎక్కువే శ్రమించాల్సి ఉంటుందని రఘునందన్ రావు పిలుపునిచ్చారు.

 దుబ్బాకలో ఎన్నికల సందర్భంగా ఎదురైన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నామని, హుజూరాబాద్ లోనూ అందుకు మినహాయింపు కాదని, అయితే ఇక్కడ దుబ్బాక కంటే రెండు పనులు ఎక్కువే చేయాలని శ్రేణులకు నిర్దేశించారు. హుజూరాబాద్ లో బీజేపీ మండలాల ఇన్చార్జిల సమావేశంలో రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.