Mc Afee: ప్రఖ్యాత యాంటీ వైరస్​ సాఫ్ట్​ వేర్​ 'మెక్​ అఫీ' సృష్టికర్త జైలులో మృతి

  • జైలులో ఆత్మహత్య చేసుకున్నాడన్న అధికారులు
  • పన్ను ఎగవేత కేసులో అరెస్ట్
  • స్పెయిన్ జైలులో జాన్ మెక్ అఫీ
  • అమెరికాకు అప్పగించేందుకు కోర్టు అనుమతి
  • ఆ తర్వాత కొద్ది సేపటికే మృతి
McAfee Founder Found Dead In Prison After Spanish Court Allows Extradition

ప్రఖ్యాత యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ సంస్థ మెక్ అఫీ వ్యవస్థాపకుడు జాన్ మెక్ అఫీ జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయనను అమెరికాకు అప్పగించేందుకు స్పెయిన్ కోర్టు అనుమతించిన కొన్ని గంటల్లోనే ఆయన చనిపోయారు. స్పెయిన్ లోని కేటలోనియాలోని బ్రయన్స్ 2 జైలులో ఉంటున్న ఆయన.. ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఆ జైలు మహిళా అధికారి చెప్పారు. ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు.

2014 నుంచి 2018 వరకు పన్నులు ఎగ్గొట్టిన కేసులో మెక్ అఫీ జైలులో ఉంటున్నారు. 2020 అక్టోబర్ లో ఇస్తాంబుల్ కు పారిపోతున్న అఫీని బార్సిలోనాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది. తమకు అప్పగించాలంటూ గత ఏడాది నవంబర్ లో అమెరికా విజ్ఞప్తి చేసింది. దానికి ఇవ్వాళే కోర్టు ఆమోదం తెలిపింది. అయితే, కోర్టు తీర్పును అప్పీల్ చేసుకునే అవకాశమూ అఫీకి ఉంది. ఇటు కోర్టు నిర్ణయానికి స్పెయిన్ కేబినెట్ కూడా ఆమోదం తెలిపితేనే అమెరికాకు అప్పగించాల్సి ఉంటుంది. ఆ లోపే మెక్ అఫీ చనిపోయాడు.

2014 నుంచి 2018 మధ్య అనేక మార్గాల్లో మెక్ అఫీ 1.2 కోట్ల డాలర్లు సంపాదించారని, దానికి ఆయన పన్నులు కట్టలేదని అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఆరోపిస్తోంది. 1980లో మెక్ అఫీ యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత క్రిప్టోకరెన్సీ గురూగా మారారు. దాని మీదే రోజూ 2 వేల డాలర్లను ఆయన సంపాదించేవారని చెబుతున్నారు.

క్రిప్టో కరెన్సీని తాను దాచానని అమెరికా అధికారులు అనుకుంటున్నారని, కానీ, తన దగ్గర ఏమీ లేవని జూన్ 16న ఆయన ట్వీట్ చేశారు. తన ఆస్తులన్నింటినీ సీజ్ చేశారని, తనతో ఉంటే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్నేహితులూ దూరంగా వెళ్లిపోయారని అన్నారు. తన దగ్గర ఇంకా ఏం మిగల్లేదని, చింతించడానికీ ఏమీ లేదని పేర్కొన్నారు.

More Telugu News