చంద్రబాబు, లోకేశ్‌ ప్రతి విషయానికీ రాద్ధాంతం చేస్తున్నారు: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్

24-06-2021 Thu 13:22
  • విదేశీ ప‌ర్యాట‌కుల కోసం విదేశీ మద్యం
  • దీనిని మేం కొత్తగా ఏర్పాటు చేయ‌లేదు
  • పర్యాటకాన్ని రాజకీయాలతో ముడి పెట్ట‌కూడ‌దు
  • మాయ మాటలు చెప్ప‌డంలో చంద్ర‌బాబు దిట్ట
avanti slams chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయ‌న కుమారుడు లోకేశ్‌ ప్రతి విషయానికీ రాద్ధాంతం చేస్తున్నారని ఏపీ మ‌ంత్రి అవంతి శ్రీ‌నివాస్ మండిప‌డ్డారు. క‌రోనా నేప‌థ్యంలో తూర్పు గోదావరిలో కర్ఫ్యూ ఉండ‌డం వ‌ల్లే బోటింగ్‌ జులై నుంచి ప్రారంభం అవుతుందని ఆయ‌న తెలిపారు.

విదేశీ ప‌ర్యాట‌కుల కోసం విదేశీ మద్యం అందుబాటులో ఉంచుతామని, అన్ని రాష్ట్రాల్లోనూ టూరిస్టుల కోసం మద్యం ఉంటుందని చెప్పారు. దీనిని తాము కొత్తగా ఏర్పాటు చేయ‌లేద‌‌ని, గతంలోనూ ఇది అమల్లో ఉందని తెలిపారు. అయితే, ఈ విష‌యంపై కొందరు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆయ‌న విమర్శించారు. ప‌ర్యాట‌క రంగ ప్ర‌చారాన్ని రాజకీయాలతో ముడి పెట్ట‌కూడ‌ద‌ని అన్నారు.

మాయ మాటలు చెప్ప‌డంలో చంద్ర‌బాబు దిట్ట అని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ క‌రోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్‌లో కూర్చున్నారని ఆయ‌న దెప్పిపొడిచారు. సీఎం వైఎస్‌ జగన్ ఏది చెబుతారో అది చేసి చూపిస్తారని ఆయ‌న అన్నారు. ఏపీలో త‌మ ప్ర‌భుత్వం అత్యధిక క‌రోనా టెస్టులు చేసిందని, అత్యధికంగా వ్యాక్సినేషన్ పూర్తి చేసింద‌ని ఆయ‌న తెలిపారు.