మీరు దేశానికి మరింత పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను: కరణం మల్లేశ్వరికి చంద్రబాబు విషెస్

24-06-2021 Thu 11:34
  • ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీ వీసీగా కరణం మల్లేశ్వరి నియామకం
  • అభినందనలు తెలియజేసిన చంద్రబాబు
  • మీ సారథ్యంలో ఎందరో క్రీడాకారులు తయారు కావాలని ఆకాంక్ష
Chandrababu congratulates Karanam Malleswari

ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీకి మన తెలుగుతేజం, వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి వైస్ ఛాన్సెలర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. దేశంలోనే తొలి క్రీడా విశ్వవిద్యాలయమైన ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్శిటీకి తొలి వైస్ ఛాన్సెలర్ గా నియమితులైన పద్మశ్రీ కరణం మల్లేశ్వరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని చంద్రబాబు అన్నారు.

వైస్ ఛాన్సెలర్ గా మీ నియామక వార్త తెలియగానే... 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో మీ చారిత్రక విజయం, ఒలింపిక్స్ పతకం సాధించిన మొట్టమొదటి భారత మహిళగా మిమ్మల్ని తెలుగువారంతా సగర్వంగా స్వాగతించిన క్షణాలు గుర్తుకొచ్చాయి. మీ సారథ్యంలో ఎంతో మంది క్రీడాకారులు తయారై దేశానికి పేరు తేవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.