Tadepalli: తాడేపల్లి అత్యాచారం కేసు.. ఆసుపత్రి నుంచి బాధితురాలి డిశ్చార్జ్

Tadepalli Ganga Rape Case Victim Discharged From Hospital
  • బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న ఆసుపత్రి సూపరింటెండెంట్
  • పరారీలోనే నిందితులు
  • కృష్ణా తీరంలో లభించిన నిందితుడి దుస్తులు
తాడేపల్లి అత్యాచారం కేసు బాధితురాలు నాలుగు రోజుల తర్వాత నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తెలిపారు. మరోవైపు, ఈ కేసులోని కీలక నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహానాడు కరకట్టకు చెందిన వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం తన బంధువులను కలిసి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అతడు కృష్ణా కెనాల్ వద్ద స్నానం చేస్తుండగా మత్స్యకారులు గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించారు.

విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గమనించిన నిందితుడు అదే సమయంలో కృష్ణా కెనాల్ జంక్షన్ వైపు వెళ్తున్న గూడ్సు రైలు ఎక్కి పరారైనట్టు గుర్తించి వెంబడించారు.  రైలు ఆగిన తర్వాత ప్రతి బోగీని క్షుణ్ణంగా తనిఖీ చేసినా నిందితుడి జాడ దొరకలేదు. అయితే, కృష్ణా నది తీరంలో అతడి దుస్తులు మాత్రం లభించాయి. దీంతో జాగిలాలను రప్పించి నిందితుడి కోసం ప్రయత్నించారు.

మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద కాల్వలో నిందితుడు స్నానం చేస్తున్నట్టు తెలుసుకున్న పోలీసులు మరోమారు అక్కడికెళ్లి గాలించారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కోసం వేట కొనసాగుతోంది. యువతిపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడగా, మిగిలినవారు పడవలో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
Tadepalli
Rape Case
Krishna River
Crime News

More Telugu News