మోదీజీ ఆలస్యమెందుకు.. ఉపఎన్నికలకు ఆదేశాలివ్వండి: మమతా బెనర్జీ

23-06-2021 Wed 22:48
  • మోదీపై మరోసారి విమర్శలు గుప్పించిన దీదీ
  • ప్రధాని ఆదేశాల మేరకే ఈసీ నిర్ణయాలని ఎద్దేవా
  • 7 రోజుల్లో ఉపఎన్నికలు నిర్వహించొచ్చని వ్యాఖ్య
  • కొవిడ్‌ కూడా తగ్గుముఖం పట్టిందన్న మమత  
mamata asks modi to give instructions for bypoll

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం(ఈసీ) నడుచుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రంలో జరగాల్సిన ఎన్నికలు మోదీ ఆదేశిస్తే వెంటనే జరుగుతాయని వ్యాఖ్యానించారు.

‘‘కొవిడ్‌ తగ్గుముఖం పట్టింది. ఏడు రోజుల్లోపు ఉపఎన్నికలు నిర్వహించవచ్చు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని ప్రధానిని కోరుతున్నా. మోదీ ఆదేశాల మేరకే ఈసీ నడుచుకుంటుందని విన్నా. ఇంకెందుకు ఆలస్యం? బెంగాల్‌లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 30 శాతం ఉండగానే ఎన్నికలు జరిపారు. ఇప్పుడు మూడు శాతం కంటే తక్కువే ఉంది’’ అంటూ వ్యంగ్యంగా అన్నారు.

గత నెల వెలువడిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ, దీదీ మాత్రం నందిగ్రామ్‌లో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ.. ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆరు నెలల్లోగా ఆమె మరో స్థానం నుంచి గెలుపొందాల్సిన అనివార్యత ఏర్పడింది.