KCR: దరిద్రం వదిలిపోవాలంటే ఏంచేయాలో ఆసక్తికరంగా వివరించిన సీఎం కేసీఆర్

CM KCR explains how to take lead on poverty with savings
  • వాసాలమర్రి గ్రామంలో కేసీఆర్ పర్యటన
  • బంగ్లాదేశ్ ప్రొఫెసర్ గురించి చెప్పిన వైనం
  • ఓ కథలా ప్రజలకు వివరించిన కేసీఆర్
  • పేదరికాన్ని పొదుపుతో జయించవచ్చని వివరణ
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనాలు చేసి, సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర అంశాన్ని సభికులకు వివరించారు. బాగుపడాలంటే ఏంచేయాలో చెబుతూ బంగ్లాదేశ్ లో జరిగిన ఓ అంశాన్ని ఉదహరించారు.

"బంగ్లాదేశ్ లో ప్రొఫెసర్ హష్మీ అనే వ్యక్తి ఉంటాడు. ఆయన సమాజం కోసం, మనుషుల గురించి ఆలోచించే మనిషి. సమాజం గురించి లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి ఆయన. ఒకరోజు ఢాకాలో ఫుట్ పాత్ పై నిలుచుని ఉండగా, కొందరు ఆడవాళ్లు అటుగా వెళ్లడం ఆయన చూస్తాడు. ఆ ఆరుగురు ఆడవాళ్ల సమూహాన్ని చూడడంతో ఆయనకు బాధ కలుగుతుంది. వారు పేదవాళ్లు కావడంతో వారి బట్టలు కూడా సరిగాలేవు. ఆ మరుసటి రోజు కూడా వాళ్లు అటుగా వెళ్లడం గమనిస్తాడు. మూడో రోజు కూడా వాళ్లను చూస్తాడు. దాంతో ఆయనలో ఆసక్తి కలుగుతుంది. వీళ్ల గురించి తెలుసుకోవాలని వాళ్ల వెంబడే వెళతాడు.

వాళ్లు ఓ షావుకారు వద్దకు వెళ్లి రోజువారీ వడ్డీకి డబ్బులు తీసుకుని, ఆ డబ్బుతో హోల్ సేల్ గా కూరగాయలు కొని, వాటిని నగరంలో తిరిగి అమ్ముకుంటారు. సాయంత్రానికి మళ్లీ షావుకారు వద్దకు వెళ్లి అతనికి డబ్బులు చెల్లించి, మిగిలిన డబ్బులతో కిరాణా దుకాణానికి వెళ్లి ఇంట్లోకి అవసరమైన పప్పులు ఉప్పులు తెచ్చుకుంటారు. ఇది గమనించిన ప్రొఫెషర్ హష్మి చలించిపోతాడు. ఆ షావుకారు వీళ్ల కష్టాన్ని దోచుకుంటున్నాడని గుర్తిస్తాడు. రోజుకు 5 రూపాయల వరకు వారి కష్టాన్ని దోపిడీ చేస్తున్నాడని గ్రహిస్తాడు.

మరుసటిరోజు ఆ ఆడవాళ్లు రోడ్డుపై వెళ్లే సమయానికి అక్కడే నిలుచుంటాడు. వారు రాగానే.. ఏవమ్మా, ఇటు రండి అని పిలుస్తాడు. వారు దగ్గరికి రాగానే, నేను మీకు అప్పు ఇస్తాను, షావుకారు కంటే తక్కువ వడ్డీ అని చెబుతాడు. దాంతో ఆ ఆడవాళ్లు షావుకారు వద్దకు వెళ్లకుండా ప్రొఫెసర్ వద్దే డబ్బులు తీసుకుని, కూరగాయల వ్యాపారం చేస్తారు. ఇలా కొన్ని రోజులు సాగిపోతాయి. ఒకరోజు, ప్రొఫెసర్ ఆ ఆడవాళ్లను తన ఇంటికి భోజనానికి రావాలని పిలుస్తాడు.

మీ వల్ల నా వ్యాపారం చాలా జరిగింది... అందుకే మీకు అన్నం పెట్టాలనిపించింది. మీ భర్తలు, పిల్లలను అందరినీ తీసుకురండి అని చెబుతాడు. వాళ్లు ఆయన ఇంటికి రాగా, ఆయన అందరికీ భోజనం పెడతాడు. ఆపై ఇంట్లోని అల్మైరా నుంచి ఓ సంచి తెచ్చి వారి ముందుంచుతాడు. "అందులో 36 వేల రూపాయలు ఉన్నాయి... ఇవి మీ డబ్బులే. నేను వ్యాపారిని కాదు, యూనివర్సిటీలో ప్రొఫెసర్ ని. మిమ్మల్ని బాగుచేయాలని, మీకో దారి చూపాలని నేను ఈ విధంగా చేశాను. పేదరికంలో ఉండి కూడా ఎలా పైకి రావచ్చో మీకు అర్థమయ్యేలా చేశాను. ఈ డబ్బు మీకు తలా రూ.6 వేలు వస్తాయి. మీరు ఇకపై తోపుడు బండిపై అమ్ముకోండి" అని చెబుతాడు.

అయితే చివరగా ఒక హామీ ఇవ్వాలని కోరతాడు. నేను మిమ్మల్ని ఎలా ఒక గ్రూపుగా తయారుచేశానో, మీరు కూడా ఇదే విధంగా మరో గ్రూపును తయారుచేయాలని చెబుతాడు. కష్టంలో ఉన్నా, పేదరికంలో ఉన్నా పది రూపాయలలో ఒక రూపాయి దాచినా దారిద్ర్యం నుంచి ఎంత అద్భుతంగా పైకి రావచ్చో ఆ ప్రొఫెసర్ చేసి చూపించాడు" అని సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామ ప్రజలకు వివరించారు.
KCR
Poverty
Savings
Bangladesh
Prof Hashmi
Vasalamarri
Yadadri Bhuvanagiri District
Telangana

More Telugu News