Cherukuvada Sriranganadha Raju: క్షత్రియుల పేరుతో చంద్రబాబు యాడ్ ఇప్పించారు: ఏపీ మంత్రి శ్రీరంగనాథరాజు

  • మాన్సాస్ నేపథ్యంలో పత్రికా ప్రకటనల కలకలం
  • నిన్న ఓ పత్రికలో క్షత్రియ సమాజం పేరిట ప్రకటన
  • దీటుగా బదులిచ్చిన శ్రీరంగనాథరాజు
  • కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం
Sri Ranganatha Raju fires on Chandrababu Naidu

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు. క్షత్రియుల పేరుతో చంద్రబాబు మాన్సాస్ ట్రస్టుపై యాడ్ ఇప్పించారని ఆరోపించారు. ఏ వ్యక్తి పేరు లేకుండా 'క్షత్రియులు' అని ఎలా ప్రకటన ఇస్తారని శ్రీరంగనాథరాజు ప్రశ్నించారు. క్షత్రియులు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, కొందరు స్వార్థంతో కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రెడ్డి సామాజికవర్గాన్ని రఘురామకృష్ణరాజుతో తిట్టిస్తున్నాడని ఆరోపించారు.

"రఘురామకృష్ణరాజుకు పనేముంది... ఢిల్లీలో కూర్చుని ఏవో లేఖలు రాస్తుంటాడు. 15 నెలల నుంచి ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే రఘురామకృష్ణరాజు నియోజకవర్గానికి రాలేదు" అని శ్రీరంగనాథరాజు విమర్శించారు. ట్రస్టుల్లో లోపాలు ఉంటే ప్రభుత్వం సరిచేస్తుందని వెల్లడించారు. కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. కొవిడ్ పంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. "మా మధ్య విద్వేషాలు నింపొద్దని చంద్రబాబుకు చెబుతున్నా" అంటూ వ్యాఖ్యానించారు.

నిన్న ఓ పత్రికలో ఉభయ తెలుగు రాష్ట్రాల క్షత్రియ సమాజం పేరుతో ఓ ప్రకటన వచ్చింది. అశోక్ గజపతిరాజును విజయసాయిరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటూ ఆ ప్రకటన ద్వారా సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. విజయసాయి, వెల్లంపల్లి వ్యాఖ్యలతో క్షత్రియుల హృదయాలు గాయపడ్డాయని, వారిద్దరినీ అదుపులో ఉంచాలని సీఎం జగన్ ను ఆ ప్రకటన ద్వారా కోరారు.

అయితే ఈ ప్రకటనకు ప్రతిస్పందన అన్నట్టు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కూడా 'క్షత్రియ సోదర సోదరీమణులకు వినమ్ర విజ్ఞప్తి' అంటూ ఓ ప్రకటనలో తమ అభిప్రాయాలు వినిపించారు. రాజకీయ, సామాజిక, న్యాయపరమైన వివాదాల్లో కుల సంఘాలు జోక్యం చేసుకోవడం సబబు కాదని మంత్రి హితవు పలికారు.

More Telugu News