నీ నట్లు బిగిస్తారు ఉండు: విజయసాయిపై అయ్యన్న వ్యాఖ్యలు

22-06-2021 Tue 14:14
  • వైసీపీ పెద్దలను లక్ష్యంగా చేసుకున్న అయ్యన్న
  • ట్విట్టర్ లో విమర్శనాస్త్రాలు
  • ఓ మీడియా కథనం ఆధారంగా విజయసాయిపై సెటైర్
  • జగన్ పైనా వ్యంగ్యం
Ayyanna Patrudu comments on Vijayasai and CM Jagan

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ లో వైసీపీ పెద్దలపై విమర్శనాస్త్రాలు సంధించారు. తొలుత, మీడియాలో వచ్చిన ఓ కథనం ఆధారంగా విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ పదవిని విజయసాయిరెడ్డికి ఇప్పించేందుకు ప్రయత్నించారన్నది ఆ కథనం సారాంశం.

ఈ నేపథ్యంలో, అయ్యన్న స్పందిస్తూ.... "ఏమయ్యా కే2, రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ లాంటి ప్లాన్లు ఇప్పుడవేమీ వెయ్యడం లేదా?" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "లేకపోతే ఇంతకుమించి పెద్ద ప్లాన్లు వేస్తున్నావా? నువ్వు వేస్తున్న ఒక పెద్ద ప్లాన్ ఢిల్లీ పెద్దలకు తెలిసిందట... నీ నట్లు బిగిస్తారు ఉండు!" అంటూ వ్యాఖ్యానించారు.

అటు, సీఎం జగన్ పైనా అయ్యన్న సెటైర్ వేశారు. "తెలుగు భాషను వింతవింతగా పలుకుతూ, వినూత్న కిలికి భాషగా మార్చిన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ రెడ్డి గారూ, వితంతవులు కాదు, వితంతువులు అనాలి" అని పేర్కొన్నారు. "విధ్వంసపాలనతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు... రాజ్యాంగాన్ని అపహాస్యం చేశావు. చిట్టచివరికి తెలుగు భాషను కూడా గుచ్చిగుచ్చి చంపేస్తున్నావు. నీకు దండం పెడతా... కనీసం తెలుగుభాషనైనా ఖూనీ చేయకుండా వదిలేయ్" అంటూ వ్యాఖ్యానించారు.