తెలంగాణపై కమ్ముకుంటున్న పొడిమేఘం.. ఉక్కపోత షురూ!

22-06-2021 Tue 07:56
  • రుతుపవనాలు తాకిన తొలి వారంలో విస్తారంగా వర్షాలు
  • ఆ తర్వాత ముఖం చాటేసిన వైనం
  • 15 శాతానికి పడిపోయిన గాలిలో తేమ
  • ఉత్తర భారతదేశంలో వర్షాలు తగ్గితేనే ఇటువైపు
  • మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి
Temperatures increasing gradually in Telangana

రుతుపవనాలు తాకిన తొలి వారంలో తెలంగాణలో విస్తారంగా కురిసిన వర్షాలు ఆ తర్వాత కనుమరుగయ్యాయి. రాష్ట్రంపై పొడి మేఘాలు కమ్ముకోవడంతో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గాలిలో తేమ 15 శాతానికి పడిపోయింది. ఫలితంగా ఉక్కపోతలు మొదలయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలకు చేరుకుంది.

నేటి నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశమే లేదని వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ భారతదేశంలో మొదలైన రుతుపవనాలు ఉత్తర భారతదేశం వైపు వెళ్లిపోవడంతో అక్కడ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అక్కడ తగ్గితే ఇక్కడ వర్షాలు పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల కదలికలు తెలంగాణలో బలహీనంగా ఉన్నట్టు చెప్పారు. బంగాళాఖాతంలో ఎలాంటి మార్పులు లేవని, వాతావరణం సాధారణంగా ఉందని పేర్కొన్నారు.

కాగా, నల్గొండ జిల్లా నిడమానూరులో ఈ నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న ఇక్కడ పగటి ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలుగా ఉంది. మరో నాలుగైదు రోజులపాటు ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.