Telangana: తెలంగాణ ఎంసెట్ తేదీలు వచ్చేశాయ్.. ఆగస్టు 4 నుంచి పరీక్షలు

Telangan Govt released dates for EAMCET and other CET Exams
  • ఆగస్టు 4 నుంచి 6 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్
  • 9, 10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు
  • ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్ పరీక్షలు యథాతథం
  • వచ్చే నెలలో డిగ్రీ, పీజీ స్థాయి చివరి సెమిస్టర్ పరీక్షలు
తెలంగాణలో ఎంసెట్ పరీక్షలకు సంబంధించిన తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న ప్రకటించారు. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్ విభాగం ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే నెలలో డిగ్రీ, పీజీ స్థాయి చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో ప్రకటించిన తేదీల్లో కొద్దిపాటి మార్పులు చేసి కొత్త తేదీలను ప్రకటించారు.

కరోనా నేపథ్యంలో అన్ని నిబంధనలకు లోబడి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలతోపాటు జయశంకర్ వర్సిటీ అగ్రికల్చర్ డిప్లొమా, పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీలో డిప్లొమా కోర్సులతోపాటు బాసర ఆర్‌జీయూకేటీలో ప్రవేశాలకు ఈసారి పాలిసెట్‌ను ఆధారంగా తీసుకోనున్నారు.

ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లొమా చివరి సంవత్సరం పరీక్షలను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించి చివరినాటికి పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులకు మంత్రి సబిత ఆదేశాలు జారీ చేశారు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల బ్యాక్‌లాగ్‌ల పరీక్షలను కూడా జులై నెలాఖరు లోగా పూర్తి చేసే అవకాశాన్ని కల్పించాలని ఆదేశించారు.

ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం.. ఎంసెట్ (ఇంజినీరింగ్ ) పరీక్షను ఆగస్టు 4, 5, 6 తేదీల్లో నిర్వహిస్తారు. ఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్షను 9, 10 తేదీల్లో, ఈసెట్‌ను 3న, పీజీఈసెట్‌ను 11 నుంచి 14 వరకు , పాలిసెట్‌ను జులై 17న నిర్వహించనున్నారు. ఐసెట్, లాసెట్, ఎడ్‌సెట్ పరీక్షల తేదీల్లో మాత్రం ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఐసెట్‌ను ఆగస్టు 19, 20 తేదీల్లో, లాసెట్‌ను 23న, ఎడ్‌సెట్‌ను 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు.
Telangana
Degree
PG
EDCET
LAWCET
EAMCET

More Telugu News