ఈ సారి కూడా దూకుడు మీదే ఉన్న రవితేజ!

21-06-2021 Mon 18:51
  • ముగింపు దశలో 'ఖిలాడి'
  • ఈ నెలాఖారులో పాట చిత్రీకరణ 
  • త్వరలోనే థియేటర్లకు  
Khiladi last schedule shooting starts from end of this month

రవితేజ తన సినిమాల విషయంలో పక్కా ప్లానింగుతో ఉంటాడు. ఆ ప్లాన్ ప్రకారం ఆయన ఈ ఏడాదిలో కూడా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకున్నాడు. గతంలో లాక్ డౌన్ తరువాత ధైర్యంగా థియేటర్స్ కి వచ్చి భారీ విజయాన్ని అందుకున్నది రవితేజ సినిమానే. 'క్రాక్' సినిమాతో ఆయన తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సారి లాక్ డౌన్ తరువాత కూడా రవితేజ సినిమానే సందడి చేసే అవకాశాలు ఎక్కువనే టాక్ వినిపిస్తోంది.

రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ 'ఖిలాడి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. క్రితం నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు గానీ కరోనా వలన కుదరలేదు. చివరి షెడ్యూల్లో భాగంగా ఒక పాటను .. ఒక యాక్షన్ సీన్ ను ఈ నెల చివరి వారంలో చిత్రీకరించనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోతున్నాయి. షూటింగు తరువాత మిగతా కార్యక్రమాలను చకచకా పూర్తిచేసి థియేటర్స్ లో దింపేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.