Cash: మాయదారి మహమ్మారి ప్రభావం: బ్యాంకుల్లో దాచుకున్న డబ్బునూ డ్రా చేసేసిన జనం

  • 159 జిల్లాల్లో పడిపోయిన ఫిక్స్ డ్ డిపాజిట్లు
  • జాబితాలో తెలంగాణలోని 4, ఏపీలోని 2 జిల్లాలు  
  • జనం చెలామణీలో ఉన్న నగదు రూ.28.62 లక్షల కోట్లు
  • రూ.5.54 లక్షల కోట్ల పెరుగుదల
159 districts in 25 states see decline in fixed deposits

కరోనా మహమ్మారి చాలా మంది కడుపు కొట్టింది. ఆరోగ్యాన్ని పాడు చేసింది. డబ్బును ఖర్చు పెట్టించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. కొన్ని లక్షల మంది ఉపాధి కరవై రోడ్డున పడాల్సిన దుస్థితి వచ్చింది. చాలా మంది పూటగడిచేందుకు, మరికొందరు కరోనాతో పాడైన ఆరోగ్యాన్ని బాగు చేసుకునేందుకు దాచుకున్న డబ్బును బ్యాంకు నుంచి తీసేసుకున్నారు. పిల్లల చదువుకనో.. పెళ్లికనో బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన డబ్బునూ డ్రా చేయాల్సిన పరిస్థితి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం 25 రాష్ట్రాల్లోని 159 జిల్లాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు భారీగా తగ్గిపోయాయి.

అందులో తెలంగాణలోని 4 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ లోని 2 జిల్లాలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి (గత ఆర్థిక సంవత్సరం 2020–2021) త్రైమాసికానికి సంబంధించి ఆర్బీఐ ఈ డేటాను విడుదల చేసింది. 2018 ఏప్రిల్ – జూన్ తో 53 జిల్లాల్లోనే ఎఫ్డీలు తగ్గిపోతే.. ఇప్పుడు దాదాపు మూడు రెట్లయింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 22 జిల్లాల్లోనే ఎఫ్డీలు తగ్గడం గమనార్హం.  

గత ఆర్థిక సంవత్సరం రెండు వరుస త్రైమాసికాల్లో  15 జిల్లాల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లు తగ్గాయి. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లూ ఉన్నాయి. ఇందులోనూ భద్రాద్రి, జనగామ, కరీంనగర్ సహా దేశంలోని ఏడు జిల్లాల్లో వరుసగా మూడు త్రైమాసికాల పాటు డిపాజిట్లు తగ్గినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది.

మహమ్మారి సమయంలో అవసరాలు పెరగడంతో జనాలు డబ్బును బ్యాంకు నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రజల వద్ద నగదు చెలామణి పెరుగుతోందంటున్నారు. 2020 మార్చి 13 నుంచి 2021 మే 21 మధ్య జనం వద్ద ఉన్న నగదులో 5.54 లక్షల కోట్ల పెరుగుదల నమోదైందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో జనం వద్ద చెలామణిలో ఉన్న నగదు రూ.28.62 లక్షల కోట్లకు పెరిగింది.

అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంకుల్లో డిపాజిట్లు 5.86 శాతం పడిపోయాయని డేటా తెలిపింది. రూ.14.94 లక్షల కోట్ల నుంచి రూ.14.06 లక్షల కోట్లకు పడిపోయింది. ఇక, డిపాజిట్లు భారీగా తగ్గిన జిల్లాల్లో యూపీవే 23 ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్ లో 21, కర్ణాటక 16, మహారాష్ట్రలో 11 జిల్లాల్లో జనాలు ఫిక్స్ డ్ డిపాజిట్లను డ్రా చేసుకున్నారు. అయితే, అత్యధికంగా డిపాజిట్లను డ్రా చేసిన జిల్లాగా తమిళనాడులోని నాగపట్టణం నిలిచింది. అక్కడ 24 శాతం డిపాజిట్లను జనం బ్యాంకుల నుంచి తీసేసుకున్నారు.

More Telugu News