Team India: డబ్ల్యూటీసీ ఫైనల్: లంచ్ వేళకు టీమిండియా స్కోరు 211/7

  • బౌలర్లకు సహకరిస్తున్న సౌతాంప్టన్ పిచ్
  • అతికష్టంగా సాగుతున్న భారత బ్యాటింగ్
  • జేమీసన్ కు 3 వికెట్లు
  • నిరాశపర్చిన పంత్
Team India goes to lunch in wtc final against New Zealand

న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లో... నేడు లంచ్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. న్యూజిలాండ్ పేసర్లు విజృంభించడంతో ఇవాళ్టి ఆటలో భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది.

తొలుత విరాట్ కోహ్లీ (44)ని కైల్ జేమీసన్ వికెట్లు ముందు దొరకబుచ్చుకుని వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (4) కూడా జేమీసన్ బౌలింగ్ లో వికెట్లకు దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటివరకు ఎంతో ఓపిగ్గా ఆడిన రహానే (49)ను, వాగ్నర్ ఓ షార్ట్ బంతితో బోల్తా కొట్టించాడు.

అయితే, ఈ దశలో అశ్విన్, జడేజా జోడీ కాస్త వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా, అశ్విన్ 27 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తు సౌథీ బౌలింగ్ లో ఓ అవుట్ స్వింగ్ ను ఆడే ప్రయత్నంలో అశ్విన్ తన వికెట్ ను సమర్పించుకున్నాడు. దాంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది.

ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (15 బ్యాటింగ్), ఇషాంత్ శర్మ (2 బ్యాటింగ్) ఉన్నారు. కివీస్ బౌలర్లలో జేమీసన్ 3 వికెట్లు తీయగా, నీల్ వాగ్నర్ కు 2 వికెట్లు లభించాయి. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

More Telugu News