Vijayashanti: తెలంగాణ ప్రజలు శుద్ధ అమాయకులని, ఇట్టే మోసం చేయవచ్చని సీఎం కేసీఆర్ కు గట్టి విశ్వాసం: విజయశాంతి

  • తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత
  • పలు ప్రారంభోత్సవాలకు తరలి వెళ్లిన సీఎం కేసీఆర్
  • విమర్శలు గుప్పించిన విజయశాంతి
  • ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేశారని విమర్శలు
Vijayasanthi once again hits out CM KCR

బీజేపీ మహిళా నేత విజయశాంతి సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలంటే శుద్ధ అమాయకులని, ఇట్టే మోసం చేయవచ్చనేది సీఎం కేసీఆర్ కు గట్టి విశ్వాసం అని విమర్శించారు. నిన్నటివరకు కరోనా పేరిట పగలు కొన్ని గంటలు, రాత్రి కొన్ని గంటల పాటు లాక్ డౌన్ అమలు చేసి, చివరికి పాజిటివిటీ రేటు తగ్గిందంటూ లాక్ డౌన్ ఎత్తేశారని వెల్లడించారు. కానీ కరోనా కట్టడికి మాత్రం ఎలాంటి చర్యలు ప్రకటించలేదని ఆరోపించారు.

అంతేకాకుండా, లాక్ డౌన్ ఎత్తేసిన రోజునే జిల్లాల్లో పర్యటనలు, ప్రారంభోత్సవాలు మొదలుపెట్టేశారని వెల్లడించారు. తన దత్తత గ్రామంలో వేలాదిమందితో సామూహిక భోజనాలకు కూడా ప్లాన్ చేశారని విజయశాంతి తెలిపారు. ఇదంతా చూస్తుంటే... కరోనా తగ్గిపోయిందని ఈ కార్యక్రమాలు పెట్టారో, లేక, ఈ మొత్తం కార్యక్రమాల కోసం కరోనా తగ్గిపోయిందని తప్పుడు నివేదికలు తెప్పించి లాక్ డౌన్ ఎత్తేశారో... ప్రజలు ఆ మాత్రం గ్రహించలేని వెర్రివాళ్లు కాదని పేర్కొన్నారు.

ఇది చాలదన్నట్టుగా... తల్లిదండ్రులు వద్దని వేడుకుంటున్నా జులై నుంచి విద్యాసంస్థలను తెరిచేందుకు కూడా అనుమతులిచ్చేశారని విజయశాంతి విమర్శించారు. తద్వారా విద్యార్థుల ప్రాణాల్ని కూడా పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు మన పొరుగు రాష్ట్రాల్లో ఇంకా కఠిన నిబంధనలతో కూడిన లాక్ డౌన్లు అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని, తమిళనాడులో 10 రోజులు లాక్ డౌన్ పొడిగించారని, కర్ణాటకలోనూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని అన్నారు.

ఇంత జరుగుతున్నప్పటికీ పట్టించుకోని తెలంగాణ పాలకులు, తమ ప్రయోజనాల కోసం ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేందుకు సిద్ధపడ్డారని విజయశాంతి విమర్శించారు. ఇలాంటి సర్కారు బారినపడినందుకు రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందని రోజంటూ లేదనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదని స్పష్టం చేశారు.

More Telugu News