విజ‌య‌సాయిరెడ్డిని అదుపులో పెట్టండి: సీఎం జ‌గ‌న్‌కు రఘురామకృష్ణరాజు లేఖ‌

19-06-2021 Sat 10:31
  • అశోక్ గజపతిరాజుపై విజ‌య‌సాయి వ్యాఖ్య‌లు స‌రికాదు
  • అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు
  • ఆ తీరుతో వైసీపీకి నష్టం జరిగే అవకాశం ఉందన్న రఘురాజు  
raghu rama writes letter to jagan

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌కు వైసీపీ అసంతృప్త ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మ‌రో లేఖ రాశారు. వ‌రుస‌గా తొమ్మిది రోజుల పాటు వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, ఎన్నిక‌ల ముందు ఆ పార్టీ ఇచ్చిన హామీల‌ను గుర్తు చేసిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఈ రోజు మాత్రం వైసీపీ ఎంపీ విజయస్థాయి రెడ్డి గురించి  లేఖ రాయడం గ‌మ‌నార్హం.

మాన్సాస్ చైర్మ‌న్‌గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బాధ్య‌త‌లు స్వీక‌రించిన నేప‌థ్యంలో విజ‌య‌సాయిరెడ్డి చేస్తోన్న వ్యాఖ్య‌ల గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. విజయసాయిరెడ్డి అనవసరంగా నోరు పారేసుకొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆయ‌న‌ను అదుపు చేయాలని జ‌గ‌న్‌ను లేఖలో కోరారు.

విజయసాయిరెడ్డి తీరు వ‌ల్ల వైసీపీకి  నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పారు. అశోక్‌గజపతి రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయ‌డం సరికాదని తెలిపారు. మాన్సాస్‌ ట్రస్టుపై ఇటీవ‌ల‌ హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చిందని, అప్ప‌టి నుంచి అశోక్‌గజపతిరాజుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయ‌న చెప్పారు. వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వెంటనే అదుపులో పెట్టాలని కోరారు.