సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు తెలంగాణ క్యాబినెట్ అత్యవసర సమావేశం

18-06-2021 Fri 21:31
  • రేపు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం
  • ప్రగతి భవన్ లో భేటీ
  • లాక్ డౌన్, వర్షాలు తదితర అంశాలపై చర్చ
  • లాక్ డౌన్ పై కీలక నిర్ణయం వెలువరించే అవకాశం
  • తెలంగాణలో తగ్గిన కరోనా తీవ్రత
Telangana cabinet meet in tomorrow

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు రాష్ట్ర క్యాబినెట్ అత్యవసర సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఈ భేటీ జరుగుతుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్ డౌన్, వర్షాల సీజన్, వ్యవసాయం, గోదావరి ఎత్తిపోతల పథకాలు, జలవిద్యుదుత్పత్తి తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. రేపటి క్యాబినెట్ భేటీ అనంతరం లాక్ డౌన్ పై కీలక నిర్ణయం వెలిబుచ్చే అవకాశం ఉంది.

తెలంగాణలో ప్రస్తుతం కరోనా ఉద్ధృతి బాగా తగ్గిపోయింది. కరోనా రోజువారీ కేసుల సంఖ్య 1500కి లోపే నమోదవుతోంది. అటు కరోనా మరణాల సంఖ్య కూడా తగ్గింది. ఇప్పటికే పలు ఆంక్షలు సడలించిన సర్కారు, రేపటి క్యాబినెట్ సమావేశంలో మరికొన్ని వెసులుబాట్లు కల్పించే అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.