మాకూ సమయం వస్తుంది.. జాగ్రత్త: జగన్​ ప్రభుత్వానికి నారా లోకేశ్​ హెచ్చరిక

18-06-2021 Fri 14:13
  • తమ ఓపికను పరీక్షించొద్దని వార్నింగ్
  • 27 మంది టీడీపీ నేతలు హత్యకు గురయ్యారన్న లోకేశ్ 
  • కత్తితో బతికేవాడు.. కత్తితోనే పోతాడంటూ చురక
  • బెదిరిస్తే భయపడి పారిపోయే వాళ్లం కాదని కామెంట్
Dont Test Our Patience Nara Lokesh Warns Govt

వైసీపీ హయాంలో 27 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అభివృద్ధి చేయడం చేతగాకే తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని మండిపడ్డారు. తమ ఓపికను పరీక్షించొద్దని, తమకూ సమయం వస్తుంది.. జాగ్రత్త అని హెచ్చరించారు. అప్పుడు వైసీపీ నేతలు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న అధికారులకు తగిన బుద్ధి చెబుతాం అని అన్నారు.

కర్నూలు జిల్లా పెసరవాయిలో నిన్న హత్యకు గురైన టీడీపీ కార్యకర్తలు వడ్డు నాగేశ్వరరెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిల కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారి భౌతికకాయాలకు నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.

కత్తితో బతికేవాడు కత్తితోనే పోతాడంటూ సీఎం జగన్ పై ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. హత్యారాజకీయాలకు పాల్పడుతున్న ఎవ్వరినీ వదలబోమని, ప్రతి తప్పుకూ శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని వాహనంతో ఢీకొట్టి అతి దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. మా కార్యకర్తలను బెదిరించి, హత్య చేస్తే లొంగిపోతామని అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు.

‘‘మా కార్యకర్తలను బెదిరిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని అనుకుంటున్నారేమో. మేం భయపడి పారిపోయే వాళ్లం కాదు. టీడీపీ ఎక్కడికీ పోదు. ధైర్యంగా నిలబడి ప్రజల తరఫున పోరాడుతాం. రాష్ట్రానికి మంచి చేయండి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. రాయలసీమకు కొత్త పరిశ్రమలను తీసుకురండి. సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి’’ అని లోకేశ్ అన్నారు.