MPEDA: పచ్చ పీతలపై పేటెంట్ మనకే.. రెండు దశాబ్దాలపాటు సొంతం!

  • ఎంపెడా, ఆర్‌జీసీఏ శాస్త్రవేత్తల కృషి ఫలితం
  • 2011లో పేటెంట్ కోసం దరఖాస్తు
  • ఏపీలో వెయ్యి ఎకరాల్లో పచ్చపీతల సాగు
  • ఆగ్నేయాసియా దేశాల్లో విపరీతమైన డిమాండ్
  • కిలో పీత ఖరీదు రూ. 1600 పైమాటే
MPEDA RGCAs  mud crab hatchery tech grants patent

పచ్చపీత పిల్లలను కృత్రిమంగా ఉత్పత్తి చేసే పరిజ్ఞానానికి సంబంధించిన పేటెంట్ హక్కులు భారత్‌కు లభించాయి. 20 ఏళ్లపాటు ఇవి భారత్ సొంతం కానున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) శాస్త్రవేత్తలు, తమిళనాడులోని రాజీవ్‌గాంధీ ఆక్వాకల్చర్ పరిశోధన కేంద్రం (ఆర్‌జీసీఏ) ఈ పిల్లలను ఉత్పత్తి చేస్తున్నాయి.

ఎంపెడా శాస్త్రవేత్తలు, తమిళనాడులోని నాగపట్టిణం జిల్లా కరైమెడులో ఉన్న ఆర్‌జీసీఏ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా పచ్చపీత పిల్లలను ప్రయోగశాలల్లో ఉత్పత్తి చేసే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలలోని కొందరు ఆక్వా రైతులు ఈ పిల్లలను కొనుగోలు చేసి సాగుచేస్తున్నారు. ఏపీలో దాదాపు వెయ్యి ఎకరాల్లో ఈ పీతలను పెంచుతున్నారు. హేచరీల్లో శాస్త్రవేత్తలు ఏటా 15 లక్షల పీతలను ఉత్పత్తి చేస్తున్నారు.

 8 నెలల నుంచి ఏడాది లోపు ఉండే పచ్చపీత పిల్లలు కిలో వరకు బరువు ఉంటాయి. కేజీ పీత ధర రూ. 1600 నుంచి రూ. 2 వేల వరకు ధర పలుకుతోంది. మన దేశంలో దొరికే పచ్చ పీతలకు ఆగ్నేయాసియా దేశాల్లో విపరీతమైన గిరాకీ ఉంది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్, సింగపూర్ తదితర దేశాల మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. వీటిలో ప్రొటీన్, ఎమినో ఆమ్లాలు, డి విటమిన్, ద్రవరూప కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.

2011లో పచ్చపీతల పరిజ్ఞానానికి సంబంధించిన మేధోహక్కుల కోసం భారత్ దరఖాస్తు చేసుకోగా తాజాగా పేటెంట్ మంజూరు చేశారు. 20 ఏళ్లపాటు ఈ హక్కులు భారత్‌కే చెందుతాయి.

More Telugu News